సినిమా సీన్ కాదు. రియల్ సీనే.. కారు ఢీకొన్నా ఆగని విద్యార్థుల కొట్లాట
రోడ్డుపై గుంపుగా చేరిన విద్యార్థులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు. అప్పుడు అటుగా వచ్చిన ఒక కారు వారిని ఢీ కొట్టి వెళ్లినా విద్యార్థులు తమ గొడవను మాత్రం ఆపలేదు.
ప్రేమ దేశం వంటి సినిమాల్లో స్టూడెంట్లు రోడ్లపై పరిగెడుతూ హకీ స్టిక్కులు, క్రికెట్ బ్యాట్ లు చేతబట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళను కార్లు, బైక్ లు వచ్చి ఢీ కొడుతున్నా వాళ్లు తమ తన్నులాటను మాత్రం ఆపరు. అయితే అవి సినిమాలే.. నిజ జీవితం కాదు. అయితే నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
రోడ్డుపై గుంపుగా చేరిన విద్యార్థులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు. అప్పుడు అటుగా వచ్చిన ఒక కారు వారిని ఢీ కొట్టి వెళ్లినా విద్యార్థులు తమ గొడవను మాత్రం ఆపలేదు. ఈ గొడవ ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. గాజియాబాద్ జిల్లా మసూరి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వర్గాలకు చెందిన కళాశాల విద్యార్థులు నడిరోడ్డుపై పరస్పరం గొడవకు దిగారు. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటున్న సమయంలో ఓ కారు వేగంగా రాగా కొందరు విద్యార్థులు భయంతో చెల్లాచెదురయ్యారు.
A fight broke out between 2 student groups in Ghaziabad. What seems to be a tragic accident turned out to be a meme material when a student who was hit by a car got up and started fighting again #jaat #gazhiabaad #up #fight #gangwar #car #students pic.twitter.com/B5zr5VkU1d
— Rishabh Hindwan (@rishabhhindwan) September 21, 2022
అయితే మరికొందరు విద్యార్థులు అది గమనించకుండా గొడవపడుతుండటంతో కారు వచ్చి వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ఇద్దరు విద్యార్థులను ఢీ కొట్టగా ఒక విద్యార్థి అయితే సినిమాల్లో చూపించినట్లు గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. అతడు లేచి నుంచోగానే అతడిని మరికొందరు విద్యార్థులు పట్టుకుని కొట్టుకుంటూ వెళ్లారు. కారు వచ్చి ఢీ కొట్టినా ఏమాత్రం లెక్కచేయకుండా విద్యార్థులు రోడ్డుపైన కొట్టుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
కాగా కొంతసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవ పడుతున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులను ఢీకొన్న కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా విద్యార్థులు గొడవ పడుతుండగా కొందరు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ట్రాఫిక్ ను లెక్కచేయకుండా, వాహనాలు వచ్చి ఢీకొంటున్నా పట్టించుకోకుండా ఇంతలా కొట్టుకోవడం ఏంట్రా బాబు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.