కదిలిన చైనా, బెదిరిన ఢిల్లీ.. చైనాలో 7.2 తీవ్రతతో భూకంపం
భూమి కంపించిన వెంటనే స్థానికులు భయంతో రోడ్ల మీదకి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు కావడంతో ఇళ్లల్లోనికి వెళ్లడానికి భయపడ్డారు.
దక్షిణ చైనాలోని జిన్‌జియాంగ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో ఇది నమోదైంది. భూఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడినట్టు తెలుస్తోంది. పలు భవనాలు నేలమట్టమైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
చైనా కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తరువాత 2:09 నిమిషాలకు చైనా దక్షిణ ప్రాంతంలోని జిన్‌జియాంగ్ రీజియన్‌లో భూకంపం సంభవించింది. అక్సు ప్రీఫెక్షర్ రీజియన్ వుషి కంట్రీలో భూమి ప్రకంపించినట్లు చైనా భూకంపాల నెట్‌వర్క్ సెంటర్ తెలిపింది. కిర్గిజిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది జిన్‌జియాంగ్ రీజియన్. ఉపరితలం నుంచి 80 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లో చోటు చేసుకున్న పెను కదలికలతో జరిగిన ఈ ఘటన తీవ్రతకు వుషి కంట్రీలో కొన్ని భవనాలు బీటలు వారినట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
భూమి కంపించిన వెంటనే స్థానికులు భయంతో రోడ్ల మీదకి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు కావడంతో ఇళ్లల్లోనికి వెళ్లడానికి భయపడ్డారు. ఎముకలు కొరికే చలిలో రోడ్ల మీదే జాగారం చేశారు. తెల్లవారుజామున 2 గంటల 9 నిమిషాలకు అత్యధికంగా 7.2 తీవ్రత నమోదు కాగా, ఆ తరువాత 4 గంటల వరకూ సుమారు 14 సార్లు భూమి కంపించింది. ఈ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. ట్రాక్‌లు దెబ్బతినడంతో చాలా రైళ్లు రద్దయ్యాయి. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవల విభాగాలను ప్రభుత్వ యంత్రాంగం యాక్టివేట్ చేసింది. సహాయక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అటు పొరుగు దేశం కజకిస్థాన్లోని ఆల్మటీలో 6.7 తీవ్రత నమోదైంది. దాంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ తీవ్ర భూకంపం ధాటికి దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ భూప్రకంపనలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. గత రాత్రి 11.39 గంటల సమయంలో భూప్రకంపనలు నమోదయినట్టు వెల్లడించింది. ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో భూమి కంపించింది. ఘజియాబాద్, గ్రేటర్ నొయిడా, గుర్‌గావ్.. వంటి నగరాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.