Telugu Global
National

వీవీఐపీలు వచ్చినప్పుడే చేస్తారా? సామాన్యుల కోసం ఎందుకు చేయరు?

ప్రధాన మంత్రి లేదా ఇతర వీవీఐపీలు వచ్చినప్పుడు తక్షణమే ఫుట్‌పాత్‌లు, వీధులను శుభ్రం చేస్తారని, వారు ఇక్కడ ఉన్నంతవరకు దానిని కొనసాగిస్తారని బాంబే హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది.

వీవీఐపీలు వచ్చినప్పుడే చేస్తారా? సామాన్యుల కోసం ఎందుకు చేయరు?
X

ముంబై నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్‌ అధికారుల తీరుపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబైలో వీధి వ్యాపారులు, ఆక్రమణల సమస్యను బాంబే హైకోర్టు గతేడాది సుమోటోగా స్వీకరించింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. ప్రభుత్వం, మున్సిపల్‌ అధికారుల తీరుపై మండిపడింది. ప్రధాన మంత్రి, ఇతర వీవీఐపీలు వచ్చిన రోజు వీధులు, ఫుట్‌పాత్‌లను క్లియర్‌గా ఉంచడం వీలైనప్పుడు.. సామాన్యుల కోసం నిత్యం అలా ఎందుకు చేయ‌రని నిలదీసింది.

ప్రధాన మంత్రి లేదా ఇతర వీవీఐపీలు వచ్చినప్పుడు తక్షణమే ఫుట్‌పాత్‌లు, వీధులను శుభ్రం చేస్తారని, వారు ఇక్కడ ఉన్నంతవరకు దానిని కొనసాగిస్తారని బాంబే హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. వీవీఐపీలు వచ్చినప్పుడు చేయగలిగేవి సామాన్య ప్రజలందరి కోసం ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించింది. పన్నులు కట్టే పౌరులకు ఇది ప్రాథమిక హక్కని స్పష్టం చేసింది. వారు నడిచేందుకు సురక్షితమైన స్థలం, మంచి బాట ఉండాలని తెలిపింది.

అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉంటే పరిష్కార మార్గాలు అవే దొరుకుతాయని అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు.. ఈ అంశాన్ని క్రమంగా కాలగర్భంలో కలిపేయాలని నగరపాలక సంస్థ యత్నిస్తోందంటూ మండిపడింది. అధికారులు విధించే జరిమానాలు నామమాత్రంగానే ఉంటున్నాయని తెలిపింది. ఫుట్‌పాత్‌ ఆక్రమణల నివారణకు శాశ్వత పరిష్కార మార్గం దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదని, సత్వరమే ఈ అంశంపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించింది.

First Published:  24 Jun 2024 4:17 PM GMT
Next Story