తోపుడు బండి వ్యాపారికి.. ఇద్దరు గన్‌మెన్ల సెక్యూరిటీ
వెంటనే రామేశ్వర్‌కు రక్షణ కల్పించాలని జడ్జి పోలీసులను ఆదేశించారు. ఇక అప్పటి నుంచి ఇద్దరు గార్డులను రామేశ్వర్‌కు సెక్యూరిటీగా ఉంచారు. అతడు ఇంటికి, బండి వద్దకు, ఎక్కడకు వెళ్లినా గార్డులు వెంట ఉంటున్నారు.
అతను తోపుడు బండిపై బట్టలు విక్రయించే మామూలు వ్యాపారి. రోజుకు నాలుగైదొందల రూపాయల కంటే ఎక్కువ సంపాదించడు. ఆ సంపాదనతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాంటి సాధారణ వ్యాపారికి ఏకే-47 పట్టుకొని ఇద్దరు బాడీగార్డులు సెక్యూరిటీ అందిస్తున్నారు. ప్రతీ రోజు అతడి బండి వద్దకు వచ్చే కస్టమర్లు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ఆ వ్యాపారి సెక్యూరిటీ వెనుక ఉన్న కథేంటో తెలుసా?
ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్ దయాల్ ఒక బట్టల వ్యాపారి. అతనికి తన గ్రామంలో కొంత భూమి ఉంది. దానికి సంబంధించిన పట్టా ఇప్పించమని సమాజ్‌వాది పార్టీ మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ తమ్ముడు జుగేందర్ సింగ్‌ను కలిశాడు. ఎలాగైనా ఈ సాయం చేయమని జుగేందర్‌ను అభ్యర్థించాడు. ఈ క్రమంలో జుగేందర్, రామేశ్వర్ మధ్య వివాదం మొదలైంది. ఓ సందర్భంలో ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో తనను కులం పేరుతో దూషిస్తూ జుగేందర్ తిట్టాడని రామేశ్వర్ కేసు పెట్టాడు.
జుగేందర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో.. వాటిని కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించాడు. రామేశ్వర్ చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవమని.. తనను కేసు నుంచి విడిపించాలని కోరాడు. అయితే వెంటనే రామేశ్వర్ దయాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలని జడ్జి ఆదేశించారు.
శనివారం రామేశ్వర్ కోర్టుకు ఒంటరిగా వచ్చాడు. ఎందుకు ఒంటరిగా వచ్చావు.. నీ కోసం పోలీసులు వెంట రాలేదా అని జడ్జి ప్రశ్నించారు. లేదని రామేశ్వర్ సమాధానం ఇచ్చాడు. దీంతో వెంటనే రామేశ్వర్‌కు రక్షణ కల్పించాలని జడ్జి పోలీసులను ఆదేశించారు. ఇక అప్పటి నుంచి ఇద్దరు గార్డులను రామేశ్వర్‌కు సెక్యూరిటీగా ఉంచారు. అతడు ఇంటికి, బండి వద్దకు, ఎక్కడకు వెళ్లినా గార్డులు వెంట ఉంటున్నారు.
ఇది చూడటానికి అందరికీ ఆశ్చర్యంగా ఉన్నా.. తనకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉందని రామేశ్వర్ అంటున్నారు. ఏకే 47లు పట్టుకున్న గార్డులను చూసి తన దగ్గర బట్టలు కొనడానికి ఎవరూ రావడం లేదని చెప్తున్నాడు. కాగా, తోపుడు బండి వ్యాపారికి గార్డులు తోడుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 25న జరుగనున్నది.