Telugu Global
National

తాగి బండి నడిపితే.. పంజాబ్‌లో వింత శిక్షలు..

జరిమానా, లైసెన్స్ తాత్కాలిక సస్పెన్షన్‌ తో పాటు, పాఠాలు చెప్పడం, ఆస్పత్రి సేవ, రక్తదానం తప్పనిసరి చేశారు అధికారులు.

తాగి బండి నడిపితే.. పంజాబ్‌లో వింత శిక్షలు..
X

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి మహా అయితే ఫైన్ వేస్తారు, బండి సీజ్ చేసి రెండురోజుల తర్వాత ఇస్తారు, కౌన్సెలింగ్‌ ఇస్తారు, ఇంకా చెప్పాలంటే డ్రైవింగ్ లైసెన్స్‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తారు. వీటన్నిటితోపాటు పంజాబ్ ప్రభుత్వం మరిన్ని వింత శిక్షలు విధిస్తోంది. విచిత్రం ఏంటంటే అందులో రక్తదానం కూడా ఉంది. అవును తాగి బండి నడిపినవారికి శిక్ష రక్తదానం. అంటే తాగి బండి నడిపితే వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా రక్తదానం చేయాల్సిందే.

పాఠం చెప్పాలి, సేవ చేయాలి..

మందుబాబుల్లో పరివర్తన తెచ్చేందుకు పంజాబ్‌ ప్రభుత్వం కొత్త కొత్త శిక్షలు అమలులోకి తెస్తోంది. అందులో ఒకటి పిల్లలకు పాఠాలు చెప్పడం. డ్రంక్ అండ్ డ్రైవ్ తోపాటు, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ కి కూడా ఈ శిక్ష అమలు చేస్తారు. మితిమీరిన వేగంతో వాహ‌నాన్ని న‌డిపి మొదటిసారి పట్టుబడితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. రెండోసారి రూ.2 వేలు చెల్లించాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయితే.. మొదటి సారి 5 వేల రూపాయలు, రెండోసారి 10 వేల రూపాయలు జరిమానా. వీటితోపాటు స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పడం అనే శిక్ష అదనం. సమీపంలోని స్కూళ్లలో 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల్లో కనీసం 20 మందికి 2 గంటల సేపు పాఠాలు చెప్పాలి. మందుబాబులు పాఠాలు ఏం చెబుతారని అనుకోవచ్చు, వారి విద్యార్హతల అనుగుణంగా ఇలాంటి శిక్ష విధిస్తారు. చదువు చెప్పే టాలెంట్ లేక‌పోతే ప్రభుత్వ ఆస్పత్రిలో పనులు చేయిస్తారు. స్ట్రెచర్ మోయడం, రోగులకు సేవ చేయడం, రోగుల సహాయకులకు గైడెన్స్ ఇవ్వడం.. ఇలాంటి పనుల్ని కనీసం 2 గంటలు చేయాలి. ఫైనల్‌గా ఒక యూనిట్ రక్తం దానం చేయాలి. ఇవీ ఆ శిక్షలు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జరిమానా, లైసెన్స్ తాత్కాలిక సస్పెన్షన్‌ తో పాటు, పాఠాలు చెప్పడం, ఆస్పత్రి సేవ, రక్తదానం తప్పనిసరి చేశారు అధికారులు. పదే పదే అదే తప్పు చేస్తూ దొరికితే ఫైన్ పెంచుతారు, దాంతోపాటు సమాజ సేవ మాత్రం తప్పనిసరి. ఫైన్లు పెంచినా, కొత్త కొత్త శిక్షలు వేసినా మందుబాబుల్లో పరివర్తన వస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. అయితే కొత్త శిక్షలతో కనీసం కొంతమందిలో అయినా మార్పు వస్తుందని మద్యం తాగినా, ఆ తర్వాత బండి ముట్టుకోడానికి భయపడతారని అంచనా వేస్తున్నారు అధికారులు. అదే నిజమైతే.. మిగతా రాష్ట్రాలు కూడా పంజాబ్‌ని ఫాలో అయిపోవచ్చు.

First Published:  18 July 2022 12:26 PM IST
Next Story