Telugu Global
National

రైళ్లపై రాళ్లు, అదో సరదా.. 488మంది అరెస్ట్

2022లో భారత్ లో ఇలాంటి ఘటనలు మొత్తం 1503 జరిగాయి. వీటిపై ఆర్పీఎఫ్ కేసులు నమోదు చేసింది. చాలాచోట్ల కారకులెవరో తెలియడం లేదు. కేవలం 488మందిని మాత్రమే అరెస్ట్ చేశారు.

రైళ్లపై రాళ్లు, అదో సరదా.. 488మంది అరెస్ట్
X

వందే భారత్ రైళ్లపై ఇటీవల మూడు ప్రాంతాల్లో రాళ్లు రువ్విన ఘటనలు వార్తల్లోకెక్కాయి. అయితే ఇది కేవలం వందేభారత్ తో మొదలైంది కాదు, భారత్ లో రైళ్లపై రాళ్లు రువ్వడం అనేది చాలామందికి భలే సరదా. ఆ సరదా తీర్చుకోడానికి వేగంగా వెళ్తున్న రైళ్లపై రాళ్లు వేసి ప్రయాణికుల్ని తమకు తెలియకుండానే గాయపరుస్తుంటారు పోకిరీలు. కొంతమంది టపాకాయలు కాల్చి రైళ్లపై విసిరేస్తుంటారు. అగ్నిప్రమాదాలకు అనుకోకుండా కారణం అవుతుంటారు. ఇలాంటి పోరికీలను గతేడాది రైల్వే పోలీసులు 488మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 1503 కేసులు రిజిస్టర్ చేశారు.

భారత్ లోనే ఎక్కువ..

రైళ్ల ప్రమాదాల విషయం పక్కనపెడితే రైళ్లపై రాళ్ల దాడుల ఘటనలు భారత్ లోనే ఎక్కువ అంటున్నారు అధికారులు. రైల్వే ట్రాక్ ల పక్కన ఉండేవారు, పోకిరీలు ఎక్కువగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారని తెలుస్తోంది. 2022లో భారత్ లో ఇలాంటి ఘటనలు మొత్తం 1503 జరిగాయి. వీటిపై ఆర్పీఎఫ్ కేసులు నమోదు చేసింది. చాలాచోట్ల కారకులెవరో తెలియడం లేదు. కేవలం 488మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. వీరిలో 100మంది రైళ్లపై రాళ్లతోపాటు కాలుతున్న టపాకాయలు కూడా విసిరేశారు. అగ్నిప్రమాదాలు జరిగితే దానికి ఎవరు బాధ్యులంటూ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల విశాఖ సహా ఇతర ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లపై రాళ్లదాడి జరగడంతో ఈ ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. వందే భారత్ పై రాళ్లదాడితో అద్దాలు పగిలాయి, మిగతా రైళ్ల విషయంలో అసలు రాళ్లదాడి జరిగినట్టు కూడా కొన్నిసార్లు తెలియదు. అందుకే ఈ ఘటనలు బయటకు రాలేదు. కానీ ప్రతి ఏడాదీ ఇలాంటి కేసులు నమోదవుతుంటాయని ఆర్పీఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఏడాదికి వెయ్యికి పైగా ఇలాంటి ఘటనలు భారత్ లో జరుగుతాయి. భారత్ మినహా మిగతా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదు. అలాంటి వారికి అవగాహన కలిగించడం మినహా అధికారులు చేయగలిగిందేమీ లేదు.

First Published:  27 Jan 2023 10:30 AM GMT
Next Story