Telugu Global
National

మద్యం కుంభకోణం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు: ఢిల్లీ సీఎం కేజ్రివాల్

మద్యం స్కాంలో మనీశ్ సిసోడియాను నిందితుడిగా చేర్చి ఆయన లాకర్ ఓపెన్ చేసింది. వాళ్ల గ్రామంలోకి వెళ్లి కూడా విచారణ జరిపినా మద్యం పాలసీలో ఒక్క పైసా అక్రమం జరిగినట్లు బయటపడలేదు. ఇక కుంభకోణం ఎక్కడ జరిగిందో బీజేపీ నేతలే చెప్పాలని సవాలు విసిరారు

మద్యం కుంభకోణం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు: ఢిల్లీ సీఎం కేజ్రివాల్
X

ఢిల్లీ మద్యం కుంభకోణం ఏంటో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రివాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ వైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈ కేసులో పలువురికి నోటీసులు జారీ చేసిందని మీడియా కోడై కూస్తున్న వేళ్ల కేజ్రివాల్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆప్ సర్కార్ 2021-22 ఏడాదికి గాను ఢిల్లీలో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. ఇందులో పలు అక్రమాలు జరిగాయనే ఫిర్యాదు అందుకున్న ఈడీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా‌ను ఇందులో నిందితుడిగా చేర్చింది. ఈ క్రమంలో కేజ్రివాల్ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో రూ.1.5 లక్షల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీ మొత్తం బడ్జెట్టే రూ.70 వేల కోట్లని కేజ్రివాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ను మించిన కుంభకోణం ఎలా జరిగిందో ఆరోపిస్తున్నవారికే తెలియాలన్నారు. అదే పార్టీకి చెందిన మరో నాయకుడు రూ.8 వేల కోట్ల కుంభకోణం అంటే, ఇంకొకరు రూ.1100 కోట్ల స్కాం అని ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రూ. 144 కోట్ల స్కాం అని చెబుతుండగా.. సీబీఐ అధికారులు మాత్రం రూ. కోటి కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. అసలు ఈ కుంభకోణం ఏంటో ఏమీ అర్థం కావడం లేదని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు.

మద్యం స్కాంలో మనీశ్ సిసోడియాను నిందితుడిగా చేర్చి ఆయన లాకర్ ఓపెన్ చేసింది. వాళ్ల గ్రామంలోకి వెళ్లి కూడా విచారణ జరిపినా మద్యం పాలసీలో ఒక్క పైసా అక్రమం జరిగినట్లు బయటపడలేదు. ఇక కుంభకోణం ఎక్కడ జరిగిందో బీజేపీ నేతలే చెప్పాలని సవాలు విసిరారు. సోమవారంలోగా సినోడియా నిందితుడిగా తేలితే అరెస్టు చేయండి. లేకపోతే క్షమాపణలు చెప్పాలని కేజ్రివాల్ డిమాండ్ చేశారు. దేశంలో ఇలా ఈడీ, సీబీఐలను మీదకు వదిలి అందరినీ వేధించడానికి బదులుగా దేశ ప్రగతి కోసం ఏదైనా సానుకూలమైన పనులు చేయాలని బీజేపీకి కేజ్రివాల్ హితవు పలికారు.

కేంద్ర ప్రభుత్వం దేశానికి అవసరమైన పనులు చేయడం మానేసి సీబీఐ, ఈడీలతో కాలక్షేపం చేస్తోందని ఆయన విమర్శించారు. ఏదైనా తప్పు జరిగితే వారిని పట్టుకొనే స్వేచ్ఛ కేంద్రానికి ఉంది. కానీ దర్యాప్తు సంస్థలను అనవసరంగా వాడుకోవడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని కేజ్రివాల్ చెప్పారు. బీజేపీ చేస్తున్న ఈ పనుల కారణంగా దేశ ప్రగతి కుంటుపడుతోందని ఆయన పేర్కొన్నారు.

First Published:  16 Sept 2022 2:51 PM GMT
Next Story