Telugu Global
National

చికెన్‌లో విషం క‌లిపి, కొస‌రి కొస‌రి తినిపించింది - జార్ఖండ్‌లో స‌వ‌తి త‌ల్లి క‌ర్క‌శ‌త్వం

జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్‌ జిల్లాలోని రోహంతాండ్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఈ తాండాకు చెందిన సునీల్‌ సోరైన్‌కు మొదటి భార్య ద్వారా ఒక కుమార్తె, ముగ్గురు మగ పిల్లలు పుట్టారు.

చికెన్‌లో విషం క‌లిపి, కొస‌రి కొస‌రి తినిపించింది  - జార్ఖండ్‌లో స‌వ‌తి త‌ల్లి క‌ర్క‌శ‌త్వం
X

స‌వ‌తి త‌ల్లుల క‌ర్క‌శ‌త్వం గురించి సినిమాల్లో, టీవీ సీరియ‌ళ్ల‌లో చూస్తుంటాం. కానీ అంత‌కుమించిన సంఘ‌ట‌న ఒక‌టి జార్ఖండ్‌లో జ‌రిగింది. త‌ల్లిని, క‌న్న త‌ల్లిని కూడా గుర్తించ‌లేని వ‌య‌సులో ఉన్న ముగ్గురు పిల్ల‌ల‌కు ఈ స‌వ‌తి త‌ల్లి భోజ‌నంలో విషం క‌లిపి కొస‌రి కొస‌రి వ‌డ్డించింది. అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన పిల్ల‌లు ఇక చ‌నిపోతారులే అన్న రాక్ష‌స ఆనందంతో అక్క‌డి నుంచి జారుకుంది. కానీ విధి ఆమెకు ఎదురు తిరిగింది.

జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్‌ జిల్లాలోని రోహంతాండ్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఈ తాండాకు చెందిన సునీల్‌ సోరైన్‌కు మొదటి భార్య ద్వారా ఒక కుమార్తె, ముగ్గురు మగ పిల్లలు పుట్టారు. కానీ రెండేళ్ల క్రితం మొదటి భార్య పాము కాటుకి గురై చనిపోయింది. దాంతో పిల్లల బాగోగుల కోసం రెండేళ్ల క్రితం గోరియాచుకి చెందిన సునీత హన్డ్సాని పెళ్లి చేసుకున్నాడు. సునీత‌కు పిల్ల‌లు పుట్ట‌క‌పోవడంతో మొదటి భార్య పిల్ల‌ల్నివేధిస్తూ పైశాచిక ఆనందం పొంద‌డం అల‌వాటు చేసుకుంది. సునీల్ ఉపాధి నిమిత్తం బెంగళూరుకి వెళ్లాడు. కానీ పిల్లల సంరక్షణ త‌న‌కు సంబంధం లేద‌ని సునీత చెప్పడంతో రెండు నెలల క్రితం పిల్ల‌ల‌ను వాళ్ల నానమ్మ, తాతయ్య వద్ద వదిలాడు.

ఇటీవల రోహంతాండాలో దుర్గా పూజ ఉండటంతో సునీల్ బెంగళూరు నుంచి ఊరికి వచ్చాడు. అదే సమయంలో పిల్లల్ని కూడా నాన‌మ్మ‌, తాత‌య్య వ‌ద్ద నుంచి ఇంటికి తీసుకొచ్చి పూజ‌లో పాల్గొన్నాడు. పూజ అయ్యాక సునీల్ తిరిగి బెంగళూరుకి వెళ్లిపోగా.. సునీత.. పిల్ల‌ల కోసం ప్రేమ‌గా చికెన్ వండిన‌ట్లు న‌టించింది. అందులో విషం కలిపి కొసరి కొసరి తినిపించింది. ఆ భోజనం తిన్న అనిల్‌ సోరైన్‌ (3), శంకర్‌ సోరైన్‌ (8), విజయ్‌ సోరైన్‌ (12) పరిస్థితి విష‌మించ‌డంతో అక్క‌డి నుంచి జారుకుంది. పిల్ల‌ల అరుపులు విన్న తాండావాసులు ముగ్గురినీ ఆసుపత్రిలో చేర్చగా.. మూడేళ్ల అనిల్ చనిపోయాడు. శంకర్, విజయ్ పరిస్థితి విషమంగా ఉంది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సునీతని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

First Published:  26 Nov 2022 1:20 PM IST
Next Story