ఎన్‌వీ రమణ నియామకాన్ని నిరసిస్తూ రాజీనామా
ఎన్‌వీ రమణ సభ్యుడిగా ఉన్న ఏ ప్యానెల్‌లో కూడా తాను ఉండబోనని స్పష్టం చేశారు. అసలు ఎన్‌వీ రమణ ఒక నిపుణుడైన మధ్యవర్తి ఎలా అవుతారని శ్రీరామ్ పంచు ప్రశ్నించారు.
సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం సభ్యుడిగా ఎన్ వీ రమణ నియమించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రమణ నియామకాన్ని నిరసిస్తూ ప్రముఖ న్యాయవాది, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో సభ్యుడిగా ఉన్న శ్రీరామ్ పంచు తన పదవికి రాజీనామా చేశారు. ఎన్‌వీ రమణ సభ్యుడిగా ఉన్న ఏ ప్యానెల్‌లో కూడా తాను ఉండబోనని స్పష్టం చేశారు. అసలు ఎన్‌వీ రమణ ఒక నిపుణుడైన మధ్యవర్తి ఎలా అవుతారని శ్రీరామ్ పంచు ప్రశ్నించారు.
ఇటీవల సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం(ఎస్‌ఐఎంసీ)లో అంతర్జాతీయ మధ్యవర్తుల ప్యానెల్ సభ్యుడిగా ఎన్‌వీ రమణను నియమించారు. ఆయన ఆ బాధ్యతలు ఇప్పటికే స్వీకరించారు. ఈ నియామకంపై ప్యానెల్ సభ్యుడిగా ఉన్న శ్రీరామ్ పంచు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను రాజీనామా చేయడానికి కారణం ఎన్‌వీ రమణ నియామకమేనని స్పష్టం చేశారు.
భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్(ఐఏఎంసీ) అనే ఒక వర్చువల్ ప్రైవేట్ వెంచర్‌ను ప్రారంభించడం ద్వారా మధ్యవర్తిత్వ లక్ష్యానికి, న్యాయ మర్యాదలకు ఎన్‌వీ రమణ తీవ్ర అన్యాయం చేశారని శ్రీరామ్ ఆక్షేపించారు. తన రాజీనామా లేఖలో ఎన్‌వీ రమణను తాను జడ్జి అని గానీ, జస్టిస్ అని గానీ సంబోధించడం లేదని కూడా చెప్పారు.
రమణపైన, ఆయనకు సంబంధించిన వ్యక్తులపైన చాలా మంది మీడియేటర్లు, న్యాయవాదులు, ఇతర వ్యక్తులు గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు భారత ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. ఈ ఫిర్యాదులపై ప్రోసీడింగ్స్ కూడా మొదలయ్యాయని, అవన్నీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇది వరకు కింది స్థాయిలో కూడా మధ్యవర్తిత్వం వహించిన రికార్డులు లేని రమణను ప్యానెల్ సభ్యుడిగా నియమించడంతో పాటు ఆయన్ను నిపుణుడైన మధ్యవర్తిగా అభివర్ణించడం విస్మయం కలిగిస్తోందన్నారు. అందుకే రమణ ఉండే ఏ ప్యానెల్‌లోనూ తాను సభ్యుడిగా ఉండలేనని... ఆయనను చేర్చుకునే ఏ సంస్థలోనూ తాను భాగం కాబోనని అందుకే రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.