Telugu Global
National

'బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాలన్నిటికీ ప్రత్యేక హోదా'

బీజేపీ తో తెగ తెంపులు చేసుకున్న తర్వాత బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించారు.

బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాలన్నిటికీ ప్రత్యేక హోదా
X

2024 లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి తమ కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక హోదా కల్పిస్తామని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ అన్నారు. పాట్నాలో మీడియాతో మాట్లాడిన ఆయన ''తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనుక మాకు వస్తే, వెనుకబడిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక కేటగిరీ హోదా మంజూరు చేస్తాము. "అని నితీశ్ కుమార్ అన్నారు.

బీహార్ కు ప్రత్యేక హోదా కావాలంటూ ఆయన చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కూడా బీజేపీ ఆయన కోరికను మన్నించలేదు. ఈ మధ్య ఆయన బీజేపీ తో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

బీజేపీతో తెగతెంపులు చేసుకున్న రోజు నుంచి ఆయన ఆ పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరో వైపు దేశ‌వ్యాప్తంగా ఉన్న విపక్షాలను కూడా ఐక్యం చేసేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ మధ్య నితీశ్ కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు కూడా సమావేశమైన విషయం తెలిసిందే.

First Published:  15 Sept 2022 11:09 AM GMT
Next Story