నా ప్రతిష్టను దెబ్బతీయడానికి కోట్ల ఖర్చు
బీజేపీపై విరుచుకుపడిన ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడుతల్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ కు వ్యతిరేకంగా వస్తున్న ప్రచారాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా కూడా ఆరికట్టలేకపోతున్నాయంటూ పలు వార్తా సంస్థల్లో కథనాలు వెలువడినాయి. దీనిపై స్పందించిన సోరెన్ బీజేపీపై ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే ముందుకొచ్చి తలపడాలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు.
'మీకు ధైర్యం ఉంటే ముందు నుంచి పోరాడండి. బ్రిటిష్ వారిలా వెనుక నుంచి దాడి చేయడం ఎందుకు? కొన్నిసార్లు ఈడీ, సీబీఐతో మరికొన్నిసార్లు ఏజెన్సీలతో దాడులు చేయిస్తారు. ఇప్పుడు నా ప్రతిష్టను దెబ్బతీయడానికి వేల కోట్లు ఖర్చు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కేంద్రంలో 11 ఏళ్లు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగలేదు. ఐదేళ్లలో 13 వేల పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయి? 11 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఎందుకు రద్దయ్యాయి? ఐదేళ్లలో ఒక్క జేపీఎస్‌సీ పరీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదు. ఝార్ఖండ్ విద్యుత్‌ను బంగ్లాదేశ్‌కు ఎందుకు అమ్మారు? అని ప్రశ్నించారు.
మీ ప్రభుత్వంలో చేయలేని అనేక పనులను మేం చేసి చూపించాం. వాటిని చెబుతూ ప్రజల్లోకి వెళుతున్నాం. భవిష్యత్తులో యువతకు సంబంధించి ప్రతీ సమస్యను పరిష్కరించి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మంచి జరిగేలా చేస్తాం' అని సోరెన్ రాసుకొచ్చారు.