Telugu Global
National

కొత్త పార్లమెంట్ లో కొత్త సీట్లు.. అన్నీ ఉత్తరాది ఎంపీలకేనా..?

ఇప్పుడున్న 543 లోక్ సభ సీట్లు 2026లో 848కి పెరిగితే అందులో ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు దఖలుపడే అవకాశాలున్నాయి. జనాభా లెక్కన సీట్లు పెరిగితే 848లో దక్షిణాది రాష్ట్రాల వాటా కేవలం 165.

కొత్త పార్లమెంట్ లో కొత్త సీట్లు.. అన్నీ ఉత్తరాది ఎంపీలకేనా..?
X

కొత్త పార్లమెంట్ లో కొత్త సీట్లు.. అన్నీ ఉత్తరాది ఎంపీలకేనా..?

కొత్త పార్లమెంట్ లోని లోక్ సభా ప్రాంగణం మరింత పెద్దది, ఇక్కడ 888మంది సభ్యులు కూర్చునే అవకాశముంది. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని నొక్కి వక్కాణించారు ప్రధాని నరేంద్రమోదీ. అంటే లోక్ సభ సీట్లు పెంచబోతున్న విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ 2026లో ఖాయం కాబోతోందని హింట్ ఇచ్చారు. విభజిస్తారు సరే.. దానికి ప్రాతిపదిక జనాభాయేనా..? అదే నిజమైతే ఉత్తరాది చేతిలో దక్షిణాది దారుణంగా మోసపోయినట్టే లెక్క. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు భారీగా పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యలో పెద్దగా తేడా ఉండదు. అంటే దక్షిణాదిలో ఎంట్రీలేని పార్టీలు ఉత్తరాదిలో సత్తా చూపితే చాలు ఢిల్లీ పీఠం చేజిక్కినట్టే లెక్క.

848 స్థానాలు.. ఏ రాష్ట్రాలకు ఎన్నంటే..?

ఇప్పుడున్న 543 లోక్ సభ సీట్లు 2026లో 848కి పెరిగితే అందులో ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు దఖలుపడే అవకాశాలున్నాయి. జనాభా లెక్కన సీట్లు పెరిగితే 848లో దక్షిణాది రాష్ట్రాల వాటా కేవలం 165. ఉత్తర ప్రదేశ్, బీహార్ రెండు రాష్ట్రాల లోక్ సభ సీట్ల సంఖ్య 222కి పెరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య 461గా ఉంటుంది. అంటే దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలు కూడబలుక్కుని కూటమి కట్టినా యూపీ, బీహార్ లో గెలిచిన పార్టీల ముందు దిగదుడుపే. దక్షిణాదికి రాజకీయంగా ఇది మరణశాసనమేనని చెప్పాలి. అందుకే ఆ దిశగా బీజేపీ వడివడిగా అడుగులేస్తుందనే అనుమానాలున్నాయి.


దక్షిణాదికి అన్యాయం ఎందుకు..?

జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకే దక్షిణాది రాష్ట్రాలకు ఈ శిక్ష పడుతుందనే విషయం స్పష్టమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు కేవలం 1.5 శాతం. అదే బీహార్ లో 3 శాతం యూపీలో 2.7 శాతం, మధ్యప్రదేశ్ లో 2.6 శాతంగా ఉంది. జనాభా పెరిగింది కాబట్టి, ఆయా రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు కూడా పెరుగుతాయి. రాజస్థాన్, బీహార్, యూపీలో లోక్ సభ స్థానాలు రెట్టుంపు అవుతుండగా కేరళలో కనీసం ఒక్క సీటు కూడా పెరగదు, కారణం జనాభా పెరగలేదు. 2026లో సీట్లు పెరిగితే యూపీకి అత్యథికంగా 143 సీట్లు వస్తాయి. కేరళ లాంటి రాష్ట్రాల్లో పెరుగుదల సున్నా. అక్కడున్న 20 లోక్ సభ సీట్లు అలాగే ఉంటాయి. యూపీలో సీట్లు పెరిగితే బీజేపీకి పండగే, పరోక్షంగా కేరళలో సీట్లు పెరగకపోవడం కూడా ఆ పార్టీకి డబుల్ బొనాంజా అని చెప్పాలి.

రాజదండం పెట్టారు, గుండు సున్నా చుట్టారు..

నూతన పార్లమెంట్ లో దక్షిణాది సంప్రదాయాలకు పెద్దపీట వేశారని, రాజదండాన్ని తిరిగి లోక్ సభలో ప్రవేశపెట్టారని, దక్షిణాదికి ఇది అత్యంత గౌరవమైన విషయం అని కొంతమంది చంకలు గుద్దుకున్నారు, మోదీని ఆకాశానికెత్తేశారు. కానీ బీజేపీ రాజదండం మాత్రమే దక్షిణాదినుంచి తీసుకుంది, లోక్ సభ సీట్ల పెంపు విషయంలో గుండు సున్నా చుడుతుందనే విషయం ఆలస్యంగా అర్థమవుతోంది.

ప్రత్యామ్నాయాలేంటి..?

ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం దక్షిణాదికి అన్యాయం జరగకూడదు అనుకుంటే 2031 వరకు సీట్ల సంఖ్య పెంచకుండా ఉండాలి, దానికోసం రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ పనికి బీజేపీ ప్రభుత్వం సిద్ధపడుతుందా అంటే అనుమానమే. అసలే కర్నాటక ఫలితాలతో కాకమీద ఉంది బీజేపీ. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో దక్షిణాదిన బీజేపీకి గేట్లు మూసుకుపోయాయి కదా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అమిత్ షా తీవ్ర అసహనానికి గురైన విషయం కూడా తెలిసిందే. ఒకవేళ లోక్ సభ సీట్ల సంఖ్య పెంచినా వెబ్ స్టర్ పద్ధతి ప్రకారం తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు నష్టపోకుండా ప్రపోర్షనేట్ రేషియో ప్రకారం అన్ని రాష్ట్రాలకు న్యాయంచేయాలి. ఇక మూడోది రాజ్యసభ స్థానాలకు కూడా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం. రాజ్యాంగ నిపుణులు సూచించిన ఈ ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టిపెడితే దక్షిణాదికి అన్యాయం జరగకుండా ఉంటుంది.

అసమానతలు తీవ్రం..

ఇప్పటికే భారత్ లో రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. కేంద్రానికి అత్యధిక పన్ను చెల్లించే రాష్ట్రాలు వాటిని తిరిగి తీసుకోలేకపోతున్నాయి. లోక్ సభ సీట్ల కారణంగా అత్యల్పంగా పన్నుకట్టే రాష్ట్రాలు కూడా ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నాయి. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్ల పునర్విభజన జరిగితే ఈ అంతరాలు మరింత పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలు మరింతగా నష్టపోతాయి.

First Published:  28 May 2023 10:22 PM IST
Next Story