పీసీసీల తీర్మానాలకు సోనియా అనుమతి లేదా!?
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే పగ్గాలు చేపట్టాలంటూ దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ లు తీర్మానాలు చేసి అధిష్టానానికి పంపిస్తున్నాయి. అయితే అలా తీర్మానాలు చేయడానికి సోనియా గాంధీ ఆమోదం లేనట్టు సమాచారం.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓ వైపు రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ అశోక్ గెహ్లాట్ వంటి నేతలు పట్టుబడుతుండగా, ఎన్నికలు జరిగితే తాను బరిలో నిలవాలని మరో సీనియర్ నేత, ఎంపి శశిథరూర్ ఉవ్విళ్లూరు తున్నారు. అసలు ఎన్నికలు జరుగుతాయా లేక ఏకగ్రీవమా అనే మీమాంస నడుస్తున్ననేపథ్యంలోనే థరూర్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో రెండు రోజుల క్రితం సమావేశమై తన భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ నడిచినట్టు సమాచారం. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టాలంటూ వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ శాఖలు తీర్మానాలు చేయడం వంటి అంశాలు కూడా వీరి మధ్య జరిగిన సంభాషణల్లో చోటు చేసుకున్నట్టు తెలిసింది. ఈ సందర్భంలోనే సోనియా గాంధీ ఓ కీలక విషయాన్ని వెల్లడించారట.
పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించాలని కోరుతూ పలు కాంగ్రెస్ రాష్ట్ర విభాగాలు ఆమోదించిన తీర్మానాలకు తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ అనుమతి (ఆమోదం) ఇవ్వలేదని ఎంపీ శశిథరూర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
సోనియా గాంధీ, థరూర్‌ల మధ్య జరిగిన సమావేశంలో, సోనియా మాట్లాడుతూ, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో తాను తటస్థంగా ఉంటానని, మరో మాటలో చెప్పాలంటే, తనకు కానీ గాంధీ కుటుంబీకులకు కానీ అభ్యర్ధికి సంబంధించి ఎటువంటి ప్రాధాన్యతలు లేవని" సోనియా చెప్పినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే త్వరలో జరగనున్న పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ పోటీ చేస్తారా లేదా అన్నదానిపై మాత్రం సోనియా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు అంటున్నారు. పార్టీ అంతర్గత ఎన్నికలలో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే థరూర్ సోనియాను కలిశారని ఆ వర్గాలు తెలిపాయి.
గత కొన్ని రోజులుగా, రాహుల్ గాంధీని మళ్లీ అధ్యక్షుడిగా నియమించాలని పలు రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు తీర్మానం చేస్తున్నాయి. అయితే రాహుల్ మాత్రం అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సుముఖంగా లేరని గాంధీ కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ బుధవారంనాడు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగేందుకే ఇష్టపడుతున్నట్టు ఆయన సోనియాకు చెప్పినట్టు తెలుస్తోంది. మరోసారి ఆయన భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసి పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేయనున్నారని గెహ్లాట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అయితే పైకి తటస్థంగా ఉంటామని సోనియా చెబుతున్నప్పటికీ వారి మొగ్గు గెహ్లాట్ వైపే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల అంశం తెరపైకి వచ్చిన తొలి నాళ్ళలోనే అశోక్ గెహ్లాట్ ను కీలక పదవిలో అంటే సోనియా అధ్యక్షురాలిగా కొనసాగుతూనే ఉపాధ్యక్ష బాధ్యతలను ఆయనకు అప్పజెప్పాలని అధినేత్రి నిర్ణయించినట్టు వార్తలు వెలువడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆయనతో పాటు కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం పేరును కూడా పరిగణనలోకి తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. మొత్తం మీద పార్టీ అధ్యక్ష ఎన్నికల నామినేషన్లకు సమయం సమీపిస్తుండడంతో కాంగ్రెస్ లో ఏం జరగబోతోందనే విషయమై ఉత్కంఠ నెలకొంది.