తండ్రిని హతమార్చి.. ముక్కలుగా కోసి.. - కన్న కొడుకు ఘాతుకం
కార్పెంటరీ కోర్సు కిట్ బ్యాగ్‌లో ఉండే రంపంతో తండ్రి శరీరాన్ని ఆరు ముక్కలుగా కోసేశాడు. ఒక్కొక్క ముక్క ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసుకుని.. ఆరు సార్లు సైకిల్‌పై బయటికి వెళ్లి.. అర కిలోమీటరు దూరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.
మనుషుల్లో కాఠిన్యం పెరిగిపోతోందా.. రాక్షసత్వం నివురుగప్పిన నిప్పులా అంతర్గతంగా ప్రజ్వరిల్లుతోందా.. మానవీయ విలువలు మాయమైపోతున్నాయా.. ఇటీవల మన దేశంలోనే జరుగుతున్న పలు దారుణ ఉదంతాలు చూస్తుంటే.. ఈ సందేహాలు రేకెత్తడంలో ఆశ్చర్యం లేదు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ దారుణ హత్య ఘటనను మరువకముందే.. మరో దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా వాకర్ సహజీవనం చేస్తున్న తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తే.. ఏకంగా ఉసురు తీశాడు ఆమె ప్రియుడు అఫ్తాబ్. అంతటితో ఆగక ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి వాటిని ఫ్రిజ్‌లో ఉంచి.. రోజుకో ముక్క చొప్పున ఢిల్లీలోని అటవీ ప్రాంతాల్లో విసిరేశాడు.
ఇప్పుడు ఇదే తరహాలో జరిగిన మరో ఉదంతం పశ్చిమ బెంగాల్‌లో బయటపడింది. కన్న కొడుకే తండ్రిని హతమార్చి.. ఆయన శరీరాన్ని ఆరు ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఈ నెల 12వ తేదీన జరిగిన ఈ ఘోర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతా మెట్రో పాలిటన్ పరిధిలోని 24 పరగణాల జిల్లాకు చెందిన ఉజ్జల్ చక్రవర్తి(55) నేవీ ఉద్యోగిగా పనిచేసి.. 12 సంవత్సరాల క్రితం రిటైరయ్యారు. ఆయనకు భార్య, కొడుకు ఉన్నారు.
పాలిటెక్నిక్ కార్పెంటరీ కోర్సు చేస్తున్న కుమారుడికి రూ.3 వేలు పరీక్ష ఫీజు ఇచ్చే విషయంలో ఈ నెల 12వ తేదీన వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చక్రవర్తి తన కొడుకును చెంపపై కొట్టాడు. దీంతో అతని కొడుకు తండ్రిని వెనక్కి తోసేశాడు. తలకు కుర్చీ బలంగా తగలడంతో చక్రవర్తి స్పృహ కోల్పోయాడు. అనంతరం కొడుకు తండ్రిని గొంతు నులిమి హతమార్చాడు. ఆ తర్వాత బాత్‌రూమ్‌లోకి శవాన్ని లాక్కెళ్లి.. కార్పెంటరీ కోర్సు కిట్ బ్యాగ్‌లో ఉండే రంపంతో తండ్రి శరీరాన్ని ఆరు ముక్కలుగా కోసేశాడు. ఒక్కొక్క ముక్క ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసుకుని.. ఆరు సార్లు సైకిల్‌పై బయటికి వెళ్లి.. అర కిలోమీటరు దూరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.
ఆ తర్వాత తన తండ్రి కనిపించడం లేదంటూ ఈ నెల 15న తెల్లవారుజామున తల్లితో కలసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారిపై అనుమానం వచ్చిన పోలీసులు వారిని తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం వెల్లడించారు. వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు.. చక్రవర్తి శరీర భాగాల కోసం గాలింపు చేపట్టారు. వాటిలో కొన్ని భాగాలు మాత్రమే లభించగా, మరికొన్నింటి కోసం గాలిస్తున్నారు.