తండ్రిని చంపి.. 30 ముక్కలుగా నరికి.. - ఢిల్లీ ఘటనను తలపించిన ఉదంతం
మృతదేహాన్ని ఎవరికీ కనపడకుండా చేయాలని భావించిన విఠల్ పొలంలో నీళ్ల కోసం తవ్వి వదిలేసిన బోరు బావిలో తండ్రి మృతదేహాన్ని పడేసేందుకు ప్రయత్నించాడు. అందులో మృతదేహం పట్టకపోవడంతో.. గొడ్డలితో 30 ముక్కలుగా నరికేశాడు.
ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఘటనను తలపించేలా కర్నాటకలో మరో ఉదంతం చోటుచేసుకుంది. కన్న కొడుకు తండ్రిని హతమార్చి.. 30 ముక్కలుగా నరికేసి బోరుబావిలో వేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం బాగలకోట జిల్లా జంజురకొప్ప గ్రామానికి చెందిన పరశురామ కుళలి (54), సరస్వతి కుళలి దంపతులు తమ కుమారుడు విఠల్ పరశురామ కుళలి (20), కోడలుతో కలిసి ఉంటున్నారు.
తండ్రి పరశురామ రోజూ తాగివచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. డిసెంబర్ 7న విఠల్ తమ పొలం వద్ద ఉన్న ఇంట్లో పడుకున్నాడు. తండ్రి పరశురామ అర్ధరాత్రి వేళ అక్కడికి వెళ్లి.. కొడుకును నిద్ర లేపాడు. పొలానికి నీరు ఎందుకు పెట్టలేదని గొడవకు దిగాడు. వారి మధ్య వాగ్వివాదం పెరిగి.. ఆగ్రహం పట్టలేక కొడుకుపై గొడ్డలితో దాడికి యత్నించాడు. అతని నుంచి తప్పించుకున్న విఠల్ ట్రాక్టర్‌కు ఉన్న హైడ్రాలిక్ రాడ్డుతో తండ్రిపై దాడి చేశాడు. ఈ ఘటనలో పరశురామ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతదేహాన్ని ఎవరికీ కనపడకుండా చేయాలని భావించిన విఠల్ పొలంలో నీళ్ల కోసం తవ్వి వదిలేసిన బోరు బావిలో తండ్రి మృతదేహాన్ని పడేసేందుకు ప్రయత్నించాడు. అందులో మృతదేహం పట్టకపోవడంతో.. గొడ్డలితో తండ్రి మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికేశాడు. ఆ ముక్కలను బోరు బావిలో పడేసి.. మట్టి కప్పేసి.. నాపరాయిని మూతగా పెట్టి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
పుట్టింటికి వెళ్లి రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన పరశురామ భార్య సరస్వతి.. భర్త కోసం ఆరా తీయగా కొడుకు విఠల్ తనకు తెలియదని సమాధానమిచ్చాడు. చుట్టుపక్కల గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడం.. కొడుకు ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో తల్లి సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొడుకును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టగా, తానే తన తండ్రిని చంపేశానని విఠల్ అంగీకరించాడు. దీంతో పోలీసులు బోరు బావిని జేసీబీతో తవ్వి శరీర భాగాలను బయటికి తీశారు.