వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫ్రమ్ కాఫీషాప్..
కొంతమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు హోటల్ రూమ్స్ పక్కనే ఉన్న కాఫీషాప్ లలో కూర్చుని పనులు చేస్తున్నారట. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవల సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అలవాటైంది, అయితే బెంగళూరులోని వారికి ఇప్పుడు కొత్తగా వర్క్ ఫ్రమ్ కాఫీషాప్ కూడా పరిచయం అయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెంగళూరులో ఐటీ సెక్టార్ ఉద్యోగులు ఉన్న లగ్జరీ విల్లాలు కూడా నీటమునిగాయి. అక్కడ ఇప్పుడు పని చేయడానికి అవసరమైన వాతావరణం లేదు. అటు కంపెనీలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఉద్యోగుల్ని ఆఫీస్ లకు రావాలని పిలవడంలేదు. కొన్ని కంపెనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అటు ఆఫీస్ కి వెళ్లలేక, ఇటు ఇంట్లో పనిచేయలేక చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొంతమంది హోటల్ రూమ్స్ పక్కనే ఉన్న కాఫీషాప్ లలో కూర్చుని పనులు చేస్తున్నారట. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తగ్గేలా లేదు..
కర్నాటకను వర్షాలు ఇంకా వీడలేదు. బెంగళూరు సహా పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మరింత వర్షపాతం నమోదవుతుందనే భయాల నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు ఐటీ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారు ల్యాప్ టాప్ లు ఓపెన్ చేస్తున్నారు. తాజాగా కొంతమంది వ్యక్తులు కాఫీ షాప్ లో డెస్క్ టాప్, ల్యాప్ టాప్ పెట్టుకుని పనిచేస్తున్న ఓ ఫొటో నెట్టింట చక్కర్లుకొడుతోంది. "థర్డ్ వేవ్ కాఫీ షాప్ లో పనిచేస్తున్న వీరిని చూడండి.. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఇది వర్క్ ఫ్రమ్ కాఫీషాప్" అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.
పరిస్థితి చక్కబడేది ఎప్పుడో..
భారీ వర్షాలకు మహా నగరాలు ప్రభావితం కావడం సహజమే. కానీ బెంగళూరులో గత వందేళ్లలో లేని విలయం ఈసారి వచ్చిందని అంటున్నారు. కొత్త కొత్త వెంచర్లన్నీ 10 అడుగుల మేర నీటితో నిండిపోయాయి. అక్కడ రియల్ ఎస్టేట్ రంగం పడకేసింది. కొన్ని ప్రాంతాల్లో ఖరీదైన విల్లాలు కొన్న ఉద్యోగులు సగం రేటుకే తెగనమ్మేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అధికారులు కూడా అక్రమ లే అవుట్లపై కొరడా ఝళిపిస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపులోకి వచ్చినా కూడా.. లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారిలో భయాందోళనలు ఇప్పట్లో తగ్గేలా లేవు.