Telugu Global
National

నువ్వన్నదేగా ఆ కానిస్టేబుల్‌ చేసింది.. - కంగనాపై సోషల్‌ మీడియాలో కౌంటర్లు

రైతులను కించపరిచినందుకే తనకు చెంప దెబ్బ రుచి చూపించానన్నారు. ఈ ఘటనపై కొందరు కుల్విందర్‌కు, మరికొందరు కంగనాకు మద్దతుగా నిలుస్తున్నారు.

నువ్వన్నదేగా ఆ కానిస్టేబుల్‌ చేసింది.. - కంగనాపై సోషల్‌ మీడియాలో కౌంటర్లు
X

బాలీవుడ్‌ నటి, తొలిసారి ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్‌ని మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ చెంపదెబ్బ కొట్టిన ఘటనపై పలువురు కుల్విందర్‌ను సమర్థిస్తుండటంపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై సోషల్‌ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. గతంలో నువ్వన్నదేగా ఆ మహిళా కానిస్టేబుల్‌ చేసింది.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

నాలుగేళ్ల క్రితం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ధర్నాపై కంగనా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాళ్లంతా వంద రూపాయలు తీసుకుని ధర్నాలో పాల్గొన్నారని విమర్శించింది. అప్పట్లో ఆమె కామెంట్లు రైతులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే ఆ ధర్నా చేస్తున్నవాళ్లలో తన తల్లి కూడా ఉందని కంగనాపై దాడి చేసిన కుల్విందర్‌ తెలిపారు. రైతులను కించపరిచినందుకే తనకు చెంప దెబ్బ రుచి చూపించానన్నారు. ఈ ఘటనపై కొందరు కుల్విందర్‌కు, మరికొందరు కంగనాకు మద్దతుగా నిలుస్తున్నారు.

అయితే.. తనపై దాడి చేయడాన్ని పలువురు సమర్థిస్తుండటంపై కంగనా ఘాటుగా రియాక్టయింది. ’నేరం చేసే ప్రతివాడికీ ఏదో ఒక కారణం ఉంటుంది. అలా అని నేరస్తుల భావోద్వేగాలకు విలువిస్తే.. అనుమతి లేకుండా ఓ వ్యక్తిపై దాడి చేయడం వంటి ఘటనను సమర్థిస్తే అత్యాచారం, హత్యలు జరిగినా మీకేం పర్వాలేదనే అర్థం. మీలాంటివారు మీ మానసిక స్థితిపై దృష్టి సారించండి’ అని ఘాటుగా ట్వీట్‌ చేసింది. ఈ క్రమంలో నెటిజన్లు ఆమె పాత పోస్టులను తవ్వి తీస్తున్నారు. 2022లో జరిగిన ఆస్కార్‌ వేడుకలో హాలీవుడ్‌ నటుడు క్రిస్‌ రాక్‌.. విల్‌ స్మిత్‌ భార్యను ఎగతాళి చేశాడు. దీంతో ఆస్కార్‌ వేదికపైనే క్రిస్‌ రాక్‌ చెంప చెళ్లుమనిపించాడు స్మిత్‌. ఈ చర్యను కంగనా సమర్థించింది.

తన తల్లిని గాని, చెల్లిని గాని ఎవరైనా చులకన చేసి మాట్లాడితే నేనైతే ఇలాగే చేస్తా.. అని కూడా కామెంట్‌ చేసింది. మంచి పని చేశావ్‌.. అంటూ విల్‌ స్మిత్‌ని మెచ్చుకుంది కూడా. అదే పోస్టును ఇప్పుడు నెటిజన్లు వెతికి తీసి ఆమెకు గుర్తుచేస్తున్నారు. ఆ కానిస్టేబుల్‌ కూడా నువ్వు చెప్పినట్లే చేసింది.. నీ తల్లిని చులకన చేస్తే లాగి పెట్టి కొడతానన్నావ్‌ కదా.. తనూ అదే చేసింది.., దీన్నే ఖర్మ అంటారు,. నీకు ఇలా కావాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు.

First Published:  9 Jun 2024 7:45 PM IST
Next Story