డబ్బులివ్వలేదని.. పాములతో హడలెత్తించారు - చంబల్ ఎక్స్‌ప్రెస్‌లో భయానకం
కొంతమంది ప్రయాణికులు మహోబా రైల్వే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీనిని గమనించిన నలుగురు వ్యక్తులూ వెంటనే అప్రమత్తమై పాములను పట్టుకొని బుట్టల్లో పెట్టి.. రైలు తర్వాతి స్టేషన్‌కు చేరకముందే రైలు దిగి పరారయ్యారు.
పాములను రైలులో వదిలి ప్రయాణికులను హడలెత్తించిన ఘటన చంబల్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హావ్‌డా నుంచి ఉత్తరప్రదేశ్ మీదుగా గ్వాలియర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులోకి మహోబా జిల్లా మలప్పుర గ్రామం వద్ద నలుగురు పాములు పట్టేవాళ్లు ఎక్కారు. రైలు నడుస్తుండగానే తమతో పాటు తీసుకొచ్చిన బుట్టల్లో నుంచి పాములను బయటికి తీసి ఆడించడం మొదలుపెట్టారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మరోపక్క పాములను ఆడించిన అనంతరం ఆ వ్యక్తులు ప్రయాణికుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు.
అసలే జనంతో వెళుతున్న రైలులోకి పాములను తీసుకొచ్చి ఆడించడమే కాకుండా.. డబ్బులు కూడా డిమాండ్ చేయడంతో ప్రయాణికులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో కోపానికి గురైన వారు పాములను కంపార్ట్‌మెంట్లో వదిలేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అవి తాచుపాములు కావడంతో బోగీ అంతా ప్రయాణికుల అరుపులు, కేకలతో నిండిపోయింది. కొంతమంది బెర్తుల పైకి ఎక్కగా, మరికొందరు మరుగుదొడ్లలో దూరి గడియ పెట్టుకున్నారు. ఈ విధంగా దాదాపు అరగంటసేపు రైలులో భయానక వాతావరణం ఏర్పడింది.
ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులు మహోబా రైల్వే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీనిని గమనించిన నలుగురు వ్యక్తులూ వెంటనే అప్రమత్తమై పాములను పట్టుకొని బుట్టల్లో పెట్టి.. రైలు తర్వాతి స్టేషన్‌కు చేరకముందే రైలు దిగి పరారయ్యారు. స్టేషన్‌లో బోగీలోకి ప్రవేశించిన రైల్వే పోలీసులు రైలంతా గాలింపు చేపట్టిన అనంతరం రైలు తిరిగి బయలుదేరి గ్వాలియర్‌కు వెళ్లింది.