పేలుడు పదార్థాల స్మగ్లింగ్.. అంతర్జాతీయ సరిహద్దులో స్కానర్లతో నిఘా
ట్రక్కుల్లో అణుధార్మికత ఉండే పేలుడు పదార్థాలను తరలించే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
దేశంలో ఉగ్రదాడులు జరపడానికి వీలుగా ఇతర దేశాల నుంచి పేలుడు పదార్థాలను తరలిస్తున్నారనే సమాచారంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల వద్ద రేడియో యాక్టీవ్ డిటెన్షన్ ఎక్విప్‌మెంట్ (ఆర్డీఈ)ను అమర్చింది. దేశంలోనే తొలిసారిగా అట్టారి వద్ద ఉన్న పాకిస్తాన్ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఆర్డీఈ స్కానర్లను ఏర్పాటు చేసింది.
అఫ్గానిస్తాన్ నుంచి డ్రై ఫ్రూట్స్, ఉల్లిగడ్డ, వెల్లుల్లి వంటివి భారీగా దిగుమతి చేసుకుంటున్నాము. అక్కడి నుంచి పాకిస్తాన్ మీదుగా అట్టారీ చెక్‌పోస్టు దాటి ఇండియాలోకి ఈ ట్రక్కులు వస్తాయి. ఈ ట్రక్కుల్లో అణుధార్మికత ఉండే పేలుడు పదార్థాలను తరలించే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో అలాంటి వాటిని గుర్తించే స్కానర్లను సరిహద్దు వద్ద ఏర్పాటు చేశారు.
అట్టారీ వద్ద ఏర్పాటు చేసిన ఆర్డీఈ స్కానర్లలో ట్రక్కులను మూడు నిమిషాల సేపు పరిశీలిస్తారు. ఎక్స్‌రే మాదిరిగా పని చేసే ఈ స్కానర్ ట్రక్కును పూర్తిగా పరీక్షిస్తుంది. అంతే కాకుండా అణుధార్మికత కలిగి ఉండే పదార్థాలు ఉంటే వెంటనే హెచ్చరిస్తుంది. తొలుత అట్టారీ వద్ద ఏర్పాటు చేసిన ఈ పరికరాలను దశల వారీగా అంతర్జాతీయ చెక్ పోస్టుల వద్ద కేంద్రం ఏర్పాటు చేయనున్నది.
ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎల్‌పీఏఐ) ఆధ్వర్యంలో ఈ ఆర్డీఈలను ఇన్‌స్టాల్ చేశారు. ప్రస్తుతం ఎల్‌పీఏఐ ఆధ్వర్యంలోనే ఈ స్కానర్లు పని చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)కు పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి, వారికే నిర్వహణను అప్పగించనున్నారు. అట్టారీలో ఏర్పాటు చేసిన స్కానర్ వంటిదే నేపాల్ బార్డర్‌లో ఉన్న రాక్సౌల్ వద్ద కూడా ఇన్‌స్టాల్ చేశారు.
మయన్మార్ బార్డర్‌లోని మోరే, పెట్రాపోల్, అగర్తల, ద్వాకీ, బంగ్లా బార్డర్‌లో ఉన్న సుతర్‌కండి వద్ద కూడా ఈ ఆర్డీఈలను ఏర్పాటు చేయనున్నారు. గతేడాదే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డీఈల ఏర్పాటుకు అవసరమైన పరికరాల సప్లై, ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్ కోసం ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది.