Telugu Global
National

గోవాలో స్మృతి ఇరానీ ఫ్యామిలీకి అక్రమ రెస్టారెంట్

బీజేపీ నేతలు ప్రజలకు నీతులు చెప్తుంటారు కానీ వాళ్ళు మాత్రం పాటించరు అనడానికి ఇదో ఉదహరణ. గోవాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు జోయిష్ అక్రమంగా ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తోంది. ఇప్పుడీ వార్త సంచలనం రేపుతోంది.

గోవాలో స్మృతి ఇరానీ ఫ్యామిలీకి అక్రమ రెస్టారెంట్
X

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు జోయిష్ గోవాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ వ్యవహారం రచ్చకెక్కింది. దీనికి ఆమె అక్రమంగా లైసెన్స్ పొందినట్టు వచ్చిన వార్తలు సంచలనం రేపాయి. నార్త్ గోవాలోని అసాగావో లో ఆమె ఈ బార్ అండ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తోందని, దీనికి చాలాకాలం క్రితమే చనిపోయిన వ్యక్తి పేరిట లైసెన్స్ ని అక్రమంగా పొందిందని తెలుస్తోంది. జోయిష్ నిర్వహిస్తున్న ఈ రెస్టారెంట్ పేరు సిల్లీ సోల్స్ ఆఫ్ కేఫ్ ! ఎయిర్స్ రోడ్రిగ్స్ అనే లాయర్ దాఖలు చేసిన ఓ ఫిర్యాదును పురస్కరించుకుని గోవా ఎక్సయిజు కమిషనర్ నారాయణ్ ఎం.గాడ్ ఈ నెల 21 న దీనికి షో కాజ్ నోటీసు జారీ చేశారు. లైసెన్స్ ను రెన్యూవల్ చేసుకునేందుకు తప్పుడు, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను సమర్పించారని ఈ నోటీసుల్లో ఆరోపించారు. గత ఏడాది మే 17 న లైసెన్స్ హోల్డర్ అయిన ఆంథోనీ డీ గామా మరణించారని, అయినప్పటికీ ఆయన పేరిట గత నెల29 న లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్నారని వీటిలో పేర్కొన్నారు. 2022-23 సంవత్సరానికి గాను లైసెన్స్ ను పునరుద్ధరించాలని ఆంథోనీ డీ గామా పేరిట ఎవరో వ్యక్తి సంతకం చేశారు.. దీన్ని ఆరు నెలల్లోగా బదిలీ చేయాలని ఈ డాక్యుమెంట్ లో కోరారు. కానీ ఇది అనుమానాస్పదంగా ఉంది అని ఎక్సయిజు కమిషనర్ తెలిపారు. ఈ వ్యవహారమంతా లాయర్ ఎయిర్స్ రోడ్రిగ్స్ చొరవతో వెలుగులోకి వచ్చింది. ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేసిన ఆయన ఈ సమాచారాన్ని రాబట్టాడు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబం పన్నిన ఈ మెగా ఫ్రాడ్ పై సమగ్ర దర్యాప్తు జరగాలని, ఇందులో ఎక్సయిజు అధికారులు, లోకల్ అసాగో పంచాయత్ హస్తం కూడా ఉన్నట్టు భావిస్తున్నామని ఆయన పేర్కొన్నాడు.

గోవాలో ప్రస్తుతమున్న రెస్టారెంట్ కి మాత్రమే బార్ లైసెన్స్ జారీ చేయాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ సిల్లీ సోల్స్ ఆఫ్ కేఫ్ విషయంలో ఎక్సయిజు శాఖ ఈ రూల్స్ ని తుంగలో తొక్కిందని ఆయన ఆరోపించాడు. ఈ రెస్టారెంట్ లో ఫారిన్ లిక్కర్, దేశవాళీ లిక్కర్, నాటు మద్యం కూడా సర్వ్ చేసేందుకు అనువుగా లోగడ దీని యజమానులు లైసెన్స్ పొందారని రోడ్రిగ్స్ వివరించారు. ఎక్సయిజు దరఖాస్తులన్నీ ఆంథోనీ పేరిటే ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో రోడ్రిగ్స్ చాలానే 'పరిశోధన' చేశాడు. ఆంథోనీ ఎప్పుడు మరణించాడో తెలిపే ఆయన డెత్ సర్టిఫికెట్ ని కూడా ఈయన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సేకరించాడు.

అసాగావోలో 1200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న సిల్లీ సోల్స్ రెస్టారెంట్ ని స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ నిర్వహిస్తుండడం వెనుక బడా నేతల హస్తం ఉన్నట్టు కనిపిస్తోందని రోడ్రిగ్స్ అనుమానం వ్యక్తం చేశాడు. ఇక ... గోవా ఓ పెద్ద టూరిస్ట్ హబ్ అని, అంతర్జాతీయ టూరిస్టులంతా ఇక్కడికి వస్తుంటారని, తమ సిల్లీ సోల్స్ రెస్టారెంట్ వారికి మంచి ఫుడ్ డెస్టినేషన్ అవుతుందని జోయిష్ ఇరానీ.. యూట్యూబ్ లో ఫుడ్ క్రిటిక్ కునాల్ విజయ్ కర్ కి తెలిపారు. మొత్తానికి రోడ్రిగ్స్ చేసిన ఆరోపణలపై ఈ నెల 29 న దర్యాప్తు జరగనుంది.




First Published:  22 July 2022 3:55 AM GMT
Next Story