Telugu Global
National

క‌ళ్లు చెదిరేలా మాఫియా డాన్‌, మాజీ ఎంపీ అతీక్ ఆస్తులు

అతీక్ అహ్మ‌ద్ పాల్ప‌డిన అక్ర‌మాలు సినీ విల‌న్ల త‌లద‌న్నేలా సాగాయంటే అతిశ‌యోక్తి కాదు. ఏదైనా ఆస్తిపై అత‌ని క‌న్ను ప‌డితే అది అత‌ను సొంతం కావాల్సిందేన‌ని ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన లాల్జీ శుక్లా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

క‌ళ్లు చెదిరేలా మాఫియా డాన్‌, మాజీ ఎంపీ అతీక్ ఆస్తులు
X

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ఎంపీ, మాఫియా డాన్ అతీక్ అహ్మ‌ద్ హ‌త్య అనంత‌రం అత‌ని ఆస్తుల చిట్టా విప్పేందుకు ఈడీ ముమ్మ‌ర య‌త్నాలు చేసింది. ప్ర‌భుత్వం అధికారికంగా గుర్తించిన ఆస్తుల విలువే రూ.1,168 కోట్లు అని ఉత్త‌రప్ర‌దేశ్ లా అండ్ ఆర్డ‌ర్ ఏడీజీ ప్ర‌శాంత్‌కుమార్ ఇంత‌కుముందే వెల్ల‌డించారు. మార్కెట్‌లో వాటి విలువ వేలాది కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా.

ఇప్ప‌టివ‌ర‌కు అతీక్ ఆస్తుల్లో రూ.417 కోట్ల విలువైన ఆస్తుల‌ను అటాచ్ చేయ‌గా.. మ‌రో రూ.752 కోట్ల విలువైన ఆస్తుల‌ను కూల్చివేయ‌డ‌మో.. క‌బ్జా నుంచి విడిపించ‌డ‌మో చేశారు. అతీక్ తాను అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బును త‌న‌తో స‌న్నిహితంగా ఉండే రాజ‌కీయ నాయ‌కులు, బిల్డ‌ర్లు, పెద్ద కాంట్రాక్ట‌ర్లు, హోట‌ల్ య‌జ‌మానులు, డాక్ట‌ర్లు, లాయ‌ర్లు వంటి వారి ద్వారా వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టించాడు. వాటిలో వ‌చ్చే లాభాల వాటా తీసుకునేవాడు. ఇప్పుడు ఈ బినామీలంద‌రి గుట్టు క‌నిపెట్టి ఆయా ఆస్తుల‌ను వెలికి తీసేందుకు ఈడీ ముమ్మ‌ర య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సంజీవ్ అగ‌ర్వాల్ అనే బిల్డ‌ర్‌కు స‌మ‌న్లు జారీ చేసింది.

సినీ విల‌న్ల త‌ల‌ద‌న్నేలా అతీక్ అక్ర‌మాలు..

అతీక్ అహ్మ‌ద్ పాల్ప‌డిన అక్ర‌మాలు సినీ విల‌న్ల త‌లద‌న్నేలా సాగాయంటే అతిశ‌యోక్తి కాదు. ఏదైనా ఆస్తిపై అత‌ని క‌న్ను ప‌డితే అది అత‌ను సొంతం కావాల్సిందేన‌ని ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన లాల్జీ శుక్లా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ భూములు, వ్యాపారుల ఆస్తులు, రైతుల పొలాలు ఇష్టారాజ్యంగా ఆక్ర‌మించుకునేవాడ‌ని ఆయ‌న తెలిపారు. ప‌లు టెండ‌ర్ల‌ను ఏక‌ప‌క్షంగా ద‌క్కించుకోవ‌డంలో దిట్ట‌. అతీక్ ఆక్ర‌మించి వ‌దిలేసిన ఒకే ఒక్క ఆస్తి ఇందిరా గాంధీ భ‌ర్త ఫిరోజ్ గాంధీకి ద‌గ్గ‌ర బంధువు వెర గాంధీది కావ‌డం గ‌మ‌నార్హం. ఆమె ప్యాలెస్ టాకీస్ భ‌వ‌నాన్ని అతీక్ ఆక్ర‌మించ‌గా, ఆమె సోనియా గాంధీ, అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్‌, లోక్‌స‌భ స్పీక‌ర్ సోమ్‌నాథ్ ఛ‌ట‌ర్జీ, అప్ప‌టి యూపీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్‌ల‌కు లేఖ‌లు రాయ‌డంతో సోనియా ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీంతో అతీక్ దిగి రావాల్సి వ‌చ్చింది.

జైల్లోనే దందా..

2018లో అతీక్ డియోర జైల్లో ఉండ‌గా.. అక్క‌డే దందా చేసి ఓ వ్యాపారితో రూ.40 కోట్ల ఆస్తి బ‌ల‌వంతంగా రాయించుకున్నాడు. అతీక్ కుమారుడు ఉమ‌ర్‌, అనుచ‌రులు క‌లిసి స‌ద‌రు వ్యాపారి మోహిత్ జైస్వాల్‌ని కిడ్నాప్ చేసి జైలుకు తీసుకురావడంతో అత‌న్ని తీవ్రంగా కొట్టి ఆస్తులు రాయించుకున్నాడు. దీనిపై ఆ త‌ర్వాత జైస్వాల్ పోలీస్ కేసు పెట్టారు. ఇలా సంపాదించిన అతీక్ ఆస్తుల చిట్టా గుట్టు విప్పేందుకు ఇప్పుడు ఈడీ న‌డుం బిగించింది.

First Published:  19 April 2023 7:35 AM IST
Next Story