Telugu Global
National

60 శాతం ప్రజలకు ఆరోగ్య రక్షణ ప‌థ‌కాలు అంద‌డం లేదు : సర్వే చెప్తున్న నిజాలు

దేశంలో 60 శాతం మంది ప్రజలకు ఆరోగ్య పథ‌కాలు అందక సకాలంలో చికిత్స జరగడం లేదని ఓ సర్వే తెలిపింది. ఆరోగ్య బీమా పథకాల వల్ల కూడా ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండటం లేదని ప్ర‌ఖ్యాత ప్రిస్టిన్ కేర్ డేటా ల్యాబ్స్ జరిపిన ఒక అధ్యయనం తెలిపింది.

60 శాతం ప్రజలకు ఆరోగ్య రక్షణ ప‌థ‌కాలు అంద‌డం లేదు : సర్వే చెప్తున్న నిజాలు
X

దేశంలో ప్ర‌జ‌ల ఆరోగ్య ర‌క్ష‌ణ‌కు ప‌లు ప‌థ‌కాలు చేప‌ట్టామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌లోని డొల్లత‌నం బ‌య‌ట‌ప‌డింది. ఎన్ని ఆరోగ్య ప‌థ‌కాలు ఉన్నా ఇప్ప‌టికీ దాదాపు 60 శాతం మంది ప్ర‌జ‌ల‌కు స‌కాలంలో చికిత్స అంద‌డంలేదు. వైద్య బీమా ఉన్న 67 శాతం మంది ప్ర‌జ‌ల‌కు అస‌లు అదేమిటో..ఎంత‌మేర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో కూడా అర్ధంకావ‌డంలేద‌ని ప్ర‌ఖ్యాత ప్రిస్టిన్ కేర్ డేటా ల్యాబ్స్ జరిపిన ఒక అధ్యయనం తెలిపింది.

ఈ స్టార్టప్ సంస్థ 2022 ఆగస్టు 1-25 తేదీల మధ్య అధ్య‌య‌నం నిర్వహించింది. ఆ వివ‌రాల ప్రకారం, చాలా మంది ప్రజలు ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి, ప్రకృతి వైద్యం వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు.

"భారతదేశంలో ఆరోగ్య బీమా కు వ‌ర్తించే రేట్లు అతి తక్కువగా ఉన్నాయి. కోవిడ్‌-19 వ‌ల్ల వైద్య ఖ‌ర్చులు పెర‌గ‌డం వ‌ల్ల ప్రజలు శస్త్రచికిత్సలను చేయించుకోవ‌డంలో కానీ, చేయ‌డంలో కానీ ఆలస్యం అవుతుంది. " అని ప్రిస్టిన్ కేర్ సహ వ్యవస్థాపకుడు హర్సిమర్బీర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో పెరుగుతున్న వైద్య చికిత్సల ఖర్చులతో దాదాపు 60 శాతం మంది ప్రజ‌ల‌కు ఎటువంటి ఆరోగ్య రక్షణ లేకపోవడంతో చికిత్సలో ఆలస్యం జ‌రుగుతుంద‌ని ఆ అధ్య‌య‌నం పేర్కొంది.

ఈ అధ్య‌య‌నం కోసం 1,100 మందికి పైగా వ్యక్తుల నుండి స‌మాచారం సేక‌రించారు. 4 లక్షలకు పైగా రోగుల నుంచి అందిన డేటా ఆధారంగా చేసిన సర్వేలో, 24 శాతం మంది రోగులు క్లెయిమ్ చేసే సమయంలో డబ్బును తగ్గించడం పెద్ద స‌మ‌స్య‌గా ఉందని చెప్పారు. ఇక క్లెయిమ్ ప్ర‌క్రియ‌లో పేప‌ర్ వ‌ర్క్ వ‌ల్ల చికిత్స‌లో జాప్యంతో పాటు మొత్తం ప్ర‌క్రియ పెద్ద స‌మ‌స్య‌గా ఉంద‌ని 17 శాతం మంది చెప్పార‌ని అధ్య‌య‌నం పేర్కొంది.

హెల్త్ కేర్ ప‌రంగా చికిత్స పొంద‌డంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఈప‌థ‌కంలో సంబంధిత బీమా కంపెనీ వ‌ర్గాల నుంచి చికిత్స ప్రారంభానికి ముందుగా ఆమోదం పొంద‌డంలో జ‌రుగుతున్న జాప్యం అన‌ర్ధానికి దారితీస్తోంది. అలాగే వైద్యానికి అయ్యే ఖ‌ర్చుల‌ను త‌క్కువ అంచ‌నాలు వేయ‌డం వ‌ల్ల కూడా చికిత్స‌లో ఆలస్యం జ‌రుగుతోంద‌ని " అని సింగ్ చెప్పారు.

భారతదేశంలో 27.5 మిలియన్ల జంటలు వంధ్యత్వంతో బాధపడుతున్నారని , ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌ల‌కాశం ఉంద‌ని ప‌లువురు వైద్య రంగ నిపుణులు భావిస్తున్నార‌ని అధ్యయనం తెలిపింది. "పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఐవిఎఫ్, ఇన్ ఫెర్టిలిటీ (వంధ్యత్వ) చికిత్సా ప్రక్రియలను బీమా పరిధిలోకి తీసుకురావాలని సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది అభిప్రాయపడ్డారు" అని అధ్యయనం పేర్కొంది.

First Published:  2 Sept 2022 8:00 AM IST
Next Story