Telugu Global
National

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్నేహితుల దుర్మరణం

అత్యంత వేగంగా కారు లారీని ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జ‌య్యింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్నేహితుల దుర్మరణం
X

తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. కారులో విహారయాత్రకు వెళ్లిన స్నేహితులు తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. తెన్ కాసి జిల్లా పులియంగుడికి చెందిన ఆరుగురు స్నేహితులు శనివారం సాయంత్రం కారులో కుర్తాళం వాటర్ ఫాల్స్ సందర్శించేందుకు వెళ్లారు.

వాటర్ ఫాల్స్ వద్ద కొంతసేపు సరదాగా గడిపిన అనంతరం వారు రాత్రి తిరిగి గ్రామానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో సింగిలిపట్టు - పున్నయ్యపురం మధ్య వెళ్తూ ప్రమాదానికి గురైంది. కారు అత్యంత వేగంగా వెళుతున్న సమయంలో డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న సిమెంటు లారీని ఢీ కొట్టింది.


అత్యంత వేగంగా కారు లారీని ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జ‌య్యింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకొని ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వాహ‌నంలో ఇరుక్కుపోయిన‌ మృతదేహాలను వెలికి తీశారు. గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు మృతిచెందాడు.

చనిపోయిన యువకులను కార్తీక్, వేల్ మనోజ్, సుబ్రమణి, మనో హరన్, పోతిరాజ్ గా పోలీసులు గుర్తించారు. మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. కారు వేగంగా రావడం, సిమెంటు లారీని ఢీకొనడం వంటి దృశ్యాలు దగ్గరలోని సీసీ టీవీ పుటేజీలో నమోదు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

First Published:  28 Jan 2024 6:19 PM IST
Next Story