ఆరుగురిని బలిగొన్న మస్కిటో కాయిల్.. - మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి
శాస్త్రి పార్కు ప్రాంతంలో నివాసముంటున్న ఓ కుటుంబం గురువారం రాత్రి దోమలను నివారించేందుకు మస్కిటో కాయిల్‌ను వెలిగించి పడుకుంది.
దోమల బాధ భరించలేక మస్కిటో కాయిల్ వెలిగిస్తే.. అది ఓ కుటుంబాన్నే బలి తీసుకుంది. ఈ విషాద ఘటనలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతిచెందగా, అందులో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్కు ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రి పార్కు ప్రాంతంలో నివాసముంటున్న ఓ కుటుంబం గురువారం రాత్రి దోమలను నివారించేందుకు మస్కిటో కాయిల్‌ను వెలిగించి పడుకుంది. ఆ సమయంలో ఇంట్లో 9 మంది ఉన్నారు. మస్కిటో కాయిల్ పరుపుపై పడటంతో అది కొద్దికొద్దిగా అంటుకుంది. దీంతో గది నిండా పొగ అలుముకుంది. కిటికీలు, తలుపులు కూడా పూర్తిగా మూసి ఉండటంతో పొగ బయటికి వెళ్లే అవకాశం లేకపోయింది.
కొద్దిసేపటికి మెలకువ వచ్చి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఆ గది నుంచి బయటపడేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు.. అప్పటికే పొగంతా రూమ్‌ను కమ్ముకుంది. ఆ పొగను గుండెల నిండా పీల్చేసిన వారు.. స్పృహతప్పి పడిపోయారు.
శుక్రవారం ఉదయం వారి ఇంటి నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు ఆరుగురు మృతిచెంది ఉండటం కనిపించింది. ప్రాణాలతో మరో ముగ్గురిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.