Telugu Global
National

'మోడీ గారూ.. అధికారులను చంపొద్దు..కావాలంటే నన్ను అరెస్టు చేయండి' : మనీష్ సిసోడియా

ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక సీబీఐ అధికారి జితేంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా ఆరోపించారు. తనపై అక్రమ కేసు పెట్టడానికి ఆయన ఒప్పుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనపై ఒత్తిడి తీసుకవచ్చిందని సిసోడియా మండిపడ్డారు.

మోడీ గారూ.. అధికారులను చంపొద్దు..కావాలంటే నన్ను అరెస్టు చేయండి : మనీష్ సిసోడియా
X

"అయ్యా మోడీ గారూ..న‌న్ను కేసుల్లో ఇరికించాల‌నుకున్నా అరెస్టు చేయాల‌నుకున్నా నాతో చెప్పండి నేరుగా అక్క‌డికే వ‌స్తాను. అంతే కానీ అధికారుల‌పై ఒత్తిడి పెంచి అన‌వ‌స‌రంగా వారు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ప‌రిస్థితి క‌ల్పించ‌వ‌ద్దు" అంటూ ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తి చేశారు. త‌న‌ను అక్ర‌మంగా కేసుల్లో ఇరికించాల‌ని సిబిఐలో అధికారి జితేంద్ర కుమార్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చార‌ని ఆయ‌న అది త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని సిసోడియా చెప్పారు.

ఢిల్లీలో ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీ కింద ప్రైవేట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు కేజ్రీవాల్‌, మ‌నీష్ సిసోడియాలు వందల కోట్ల ముడుపులు తీసుకున్నారని బీజేపీ స్టింగ్ ఆప‌రేష‌న్ వీడియోను విడుదల చేసింది . ఇది జ‌రిగిన కొన్ని గంటల తర్వాత, సిసోడియా కేంద్రంపై విరుచుకుపడ్డారు.

''రెండు రోజుల క్రితం సీబీఐ అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అధికారి జితేంద్ర కుమార్ అని, అతను సీబీఐలో అవినీతి నిరోధక శాఖ విభాగంలో న్యాయ సలహాదారు అని మేము తెలుసుకున్నాం. కేసుల చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌ను ప‌రిశీలించి వాటి చట్టబద్ధత ఆధారంగా కేసును ఆమోదించడం లేదా తిరస్కరించడం అతని పని. ఆయ‌న నాపై ఎఫ్ఐఆర్ న‌మోదుకు లేదా తిర‌స్క‌ర‌ణ‌కు గ‌ల చట్టబద్ధతను కూడా పరిశీలిస్తున్నాడు "అని సిసోడియా చెప్పారు. అక్ర‌మ ప‌ద్ధ‌తుల్లో అయినా నాపై కేసు న‌మోదు చేసేందుకు ఆయ‌న‌పై ఒత్తిడి తెచ్చారు. అందుకు జితేంద్ర కుమార్ నిరాక‌రించ‌డంతో ఆయనపై ఒత్తిడి పెంచారు. ఆయ‌న ఆ ఒత్తిడిని త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు మా సానుభూతి తెలుపుతున్నాం. త‌ప్పుడు విధానాల‌ను అవ‌లంభించి ప్ర‌త్య‌ర్ధి పార్టీల నాయ‌కుల‌పై అక్ర‌మ కేసులు పెట్టాల‌ని అధికారుల‌పై ఒత్తిడి చేయ‌డం దుర్మార్గం. అది త‌ప్పు. " అన్నారు సిసోడియా.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీకి సిసోడియా విజ్ఞ‌పి చేస్తూ.. " మీరు నన్ను తప్పుడు కేసులో ఇరికించాలనుకుంటే, చేయండి. మీరు నాపై దాడి చేయాలనుకున్నారు.. చేసారు. మీరు నాపై తప్పుడు కేసు పెట్టారు. మీరు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడికి రావాలో చెప్పండి. నేను అక్కడే ఉంటాను. దయచేసి అధికారులపై ఒత్తిడి తెచ్చి వారు ఆత్మహత్యలకు పాల్ప‌డేలా చేయ‌కండి" అని ఆయన అన్నారు.

"ఇది కుటుంబాలను నాశనం చేస్తోంది. మీరు సిబిఐ, ఇడి సంస్థ‌ల‌ను ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎన్నికైన ప్రభుత్వాలను ఎలా పడగొట్టవచ్చు.. ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేయవచ్చు అని ఆలోచిస్తూ ఉండొచ్చు. మ‌రి పాఠశాలలు, ఆసుప‌త్రుల నిర్మాణం గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? ద్రవ్యోల్బణంపై పోరాటం గురించి, ఉద్యోగాల క‌ల్ప‌న గురించిఎప్పుడు ఆలోచిస్తారు? అని ప్ర‌ధాని మోడీని సిసోడియా నిల‌దీశారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడం ఎలా అని మీరు ఆలోచిస్తున్నారు. "జితేంద్ర కుమార్ ఆత్మహత్య గురించి నేను ప్రధానమంత్రిని 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను - అధికారులపై ఎందుకు ఎక్కువ ఒత్తిడి ఉంది. వారు ఆత్మహత్యకు పాల్ప‌డేలా ఎందుకు ఒత్తిడి పెంచుతున్నారు. మీ స్వంత అధికారులను ఎందుకలా హింసిస్తారు. 'ఆపరేషన్ లోట‌స్ ' నిర్వహించడమే కేంద్ర ప్రభుత్వ ఏకైక పనిగా క‌న‌బ‌డుతోంది. ప్రతిపక్ష ప్రభుత్వాలను అణిచివేయడానికి ఇంకా ఎంద‌రు ఎన్ని త్యాగాలు చేయాలి?" అని ప్ర‌ధానిపై విరుచుకుప‌డ్డారు. " ఇలా అధికారులు ఒత్తిడితో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌లేదు. ఇది చాలా విచార‌క‌రం, దుర‌దృష్ట క‌రం " అని సిసోడియా అన్నారు.

First Published:  5 Sept 2022 4:41 PM IST
Next Story