ఒంటిపూట ఆఫీసులు.. సీఎంకి జై కొట్టిన ఉద్యోగులు
కొత్త విధానం వల్ల సూర్యకాంతిని గరిష్టంగా ఉపయోగించుకోగలుగుతామని అంటున్నారు. దీనివల్ల అన్నిరకాల ఖర్చులు తగ్గుతాయని, ప్రభుత్వానికి 42కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని అధికారులు లెక్క తేల్చారు.
ఎండాకాలం ఒంటిపూట బడులు ఉంటాయి కానీ, ఒంటిపూట ఆఫీస్ లనే సంప్రదాయం ఎక్కడా లేదు. కానీ తొలిసారిగా పంజాబ్ సీఎం భగవంత్ మన్ దీన్ని తెరపైకి తెచ్చారు. మంగళవారం నుంచి పంజాబ్ లో ఆఫీస్ పనివేళలు మారిపోయాయి. ఉదయం 7.30గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాలు తెరచి ఉంచుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాళం పడితే, తిరిగి తర్వాతి రోజు ఏడున్నరకే అధికారులు, ప్రజలకు అందుబాటులోకి వస్తారు. మధ్యాహ్నం అరగంట సేపు ఉద్యోగులకు లంచ్ బ్రేక్ ఇచ్చారు.
సీఎం జిందాబాద్..
సహజంగా ప్రైవేటు ఆఫీసుల్లో షిప్ట్ లు ఉంటాయి. షిఫ్ట్ ల ప్రకారం టైమ్ అడ్జస్ట్ చేసుకుని ఇంటి పనులు, ఇతర వ్యక్తిగత పనులు చక్కబెట్టుకుంటారు ఉద్యోగులు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ అవకాశం లేదు. ఇప్పుడు మండుతున్న ఎండల కారణంగా సగం పూట పూర్తిగా వారికి రెస్ట్ దొరికింది. పంజాబ్ లో అమలులోకి వచ్చిన ఈ కొత్త కాన్సెప్ట్ తో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం భగవంత్ మన్ ని మెచ్చుకుంటున్నారు.
ఉదయం ఏడున్నరకే ఆఫీస్ లకు సిబ్బంది..
ఉదయం 9 గంటలకు ఆఫీస్ అంటే పది, పదిన్నర వరకు చాలామంది సీట్లలో కుదురుకోరు. కానీ ఒంటిపూట ఆఫీస్ కి మాత్రం ఠంచనుగా వచ్చేస్తున్నారంతా. ఉదయం ఏడున్నర గంటలకే సిబ్బంది, అధికారులు ఆఫీస్ లకు హాజరైనట్టు సీఎంకి రిపోర్ట్ వచ్చింది. స్వయానా సీఎం భగవంత్ మన్ ఉదయం 7.28 గంటలకే సిబ్బందితో కలసి సెక్రటేరియట్ కి వచ్చారు. జులై 15 వరకు కొత్త పనివేళలు అమలవుతాయని చెప్పారాయన. కొత్త విధానం వల్ల సూర్యకాంతిని గరిష్టంగా ఉపయోగించుకోగలుగుతామని అంటున్నారు. దీనివల్ల అన్నిరకాల ఖర్చులు తగ్గుతాయని, ప్రభుత్వానికి 42కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని అధికారులు లెక్క తేల్చారు.