Telugu Global
National

సింగర్ కైలాష్ ఖేర్ పై కర్ణాటకలో యువకుల దాడి

ఈ ఘటన జరిగిన తర్వాత కూడా కైలాష్ ఖేర్ యథావిధిగా కార్యక్రమాన్ని కొనసాగించారు. పోలీసులు హంపి ఉత్సవాలు జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని కైలాష్ ఖేర్ పై వాటర్ బాటిల్ విసిరిన యువకులను అదుపులోకి తీసుకున్నారు.

సింగర్ కైలాష్ ఖేర్ పై కర్ణాటకలో యువకుల దాడి
X

ప్రముఖ సినీ, జానపద గాయకుడు కైలాష్ ఖేర్ పై కర్ణాటక యువకులు వాటర్ బాటిల్ తో దాడి చేశారు. సంగీత విభావరిలో ఆయన కేవలం హిందీ పాటలే పాడుతుండటంతో ఆగ్రహించిన కర్ణాటక యువకులు ఆయనపై వాటర్ బాటిల్ తో దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కైలాష్ ఖేర్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయన హిందీ, తెలుగు సహా పలు భాషల్లో వందలాది పాటలు పాడారు.

కాగా, కర్ణాటకలోని హంపిలో ప్రస్తుతం హంపి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి నిర్వాహకులు సంగీత విభావరి నిర్వహించారు. అందులో సింగర్ కైలాష్ ఖేర్ పాల్గొని పాటలు పాడారు. అయితే ఆయన స్టేజ్ పై పూర్తిగా హిందీ పాటలే పాడుతుండటంతో కన్నడ పాటలు ఎందుకు పాడటం లేదని కొందరు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక వద్ద నానా హంగామా చేశారు. కొందరు యువకులు కైలాష్ ఖేర్ పై వాటర్ బాటిల్ విసిరారు. అయితే ఆ బాటిల్ ఆయనకు తగల్లేదు కానీ పక్కనుంచి వెళ్ళింది.

ఈ ఘటన జరిగిన తర్వాత కూడా కైలాష్ ఖేర్ యథావిధిగా కార్యక్రమాన్ని కొనసాగించారు. పోలీసులు హంపి ఉత్సవాలు జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని కైలాష్ ఖేర్ పై వాటర్ బాటిల్ విసిరిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా కొద్ది రోజుల కిందట కర్ణాటకలోని బళ్లారిలో బళ్లారి ఉత్సవాలు నిర్వహించారు. ఆ సమయంలో ప్రముఖ సింగర్ మంగ్లీ కన్నడలో మాట్లాడలేదని కొందరు యువకులు ఆమె కారుపై రాళ్ల దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత మంగ్లీ కర్ణాటకలో తనపై ఎటువంటి దాడి జరగలేదని ప్రకటించింది. అయితే ఇష్యూ పెద్దది కాకూడదన్న ఉద్దేశంతోనే మంగ్లీ ఆ ప్రకటన చేసిందని ప్రచారం జరిగింది. కర్ణాటకలో వరుసగా సింగర్లపై దాడులు జరుగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి.

First Published:  30 Jan 2023 7:24 AM GMT
Next Story