సిక్కిం వరదల్లో 40కి చేరిన మృతుల సంఖ్య.. డెడ్‌బాడీలు బెంగాల్‌లో లభ్యం
వరదల కారణంగా సిక్కింలోని 13 వంతెనలు ధ్వంసమయ్యాయి. ఒక్క మంగన్ జిల్లాలోనే ఎనిమిది వంతెనలు కొట్టుకుపోగా.. గ్యాంగ్‌టక్‌లో మూడు, నామ్‌చీలో రెండు వంతెనలు ధ్వంసమయ్యాయి.
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 40కి చేరింది. ఇందులో 17 డెడ్‌బాడీలు పశ్చిమ బెంగాల్ జల్పాయ్‌గురి జిల్లాలోని తీస్తా నదిలో లభ్యమయ్యాయి. గల్లంతైన మరో 100 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. చుంగ్ తాంగ్ డ్యాంలోకి వరద ప్రవాహం పెరగటం వల్ల నీటిని విడుదల చేశారు. దీంతో తీస్తా నది పరివాహక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. సైనిక శిబిరాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. పాక్యోంగ్‌లో 59 మంది, గ్యాంగ్‌టక్‌లో 22, మంగన్‌లో 17, నామ్‌చీలో ఐదుగురు గల్లంతయ్యారు. సైన్యం, NDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
వరదల కారణంగా సిక్కింలోని 13 వంతెనలు ధ్వంసమయ్యాయి. ఒక్క మంగన్ జిల్లాలోనే ఎనిమిది వంతెనలు కొట్టుకుపోగా.. గ్యాంగ్‌టక్‌లో మూడు, నామ్‌చీలో రెండు వంతెనలు ధ్వంసమయ్యాయి. చుంగ్తాంగ్ పట్టణం వరదల ఉద్ధృతికి తీవ్రంగా దెబ్బతింది. దీంతో పాటు సిక్కిం రాష్ట్ర జీవనాడిగా భావించే నేషనల్ హైవే-10 కూడా పూర్తిగా దెబ్బతింది. ఇప్పటివరకు 2,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని సిక్కిం విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వరదల ప్రభావం దాదాపు 22 వేల మందిపై పడిందని పేర్కొంది.