రూ. 5 కోట్ల విలువైన భూమిని రైతులకు పంచిన సోదరులు
మానవత్వాన్ని, ప్రేమను ప్రపంచమంతా చాటాలనే ఉద్దేశంతోనే భూమిని రైతులకు విరాళంగా ఇచ్చామని సిక్కు సోదరులు చెబుతున్నారు.
గజం స్థలం కోసం గట్టు తగాదాలకు దిగుతున్న ఈ రోజుల్లో ఓ సోదరులు ఏకంగా రూ. 5 కోట్ల విలువైన స్థలాన్ని రైతులకు బహుమతిగా ఇచ్చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన ఇద్దరు సిక్కు సోదరులు గురునానక్ జయంతి (గురు పూర్ణిమ) సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని పర్విన్ నదికి వరదలు వచ్చాయి. విపరీతమైన వరద కారణంగా కొంత మంది రైతుల పొలాల్లోని పంట పూర్తిగా కొట్టుకొని పోయి.. ఆ నేల వ్యవసాయానికి పనికి రాకుండా పోయింది. ఈ విషయం యూపీలో ఉంటున్న ఇద్దరు సిక్కు సోదరులకు తెలిసింది.
యూపీలో చాన్నాళ్లుగా వ్యవసాయం చేస్తున్న ధనిక రైతు సోదరులకు ఈ విషయం తెలసింది. సాటి రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి తట్టుకోలేకపోయారు. వెంటనే ఉత్తరాఖండ్ వెళ్లి.. రూ. 5 కోట్ల విలువైన 12 ఎకరాలను కొనుగోలు చేశారు. మంగళవారం గురుపూర్ణిమ సందర్భంగా 16 మంది రైతులకు పంచి పెట్టారు. రాబోయే రోజుల్లో మరో 4 ఎకరాలు కొని పంచుతామని బల్విందర్, హర్పాల్ సింగ్ తెలిపారు. ఆదివారమే ఉత్తరాఖండ్‌లోని కంచన్‌పూర్ వెళ్లిన బల్వంత్ సింగ్.. అక్కడి రెవెన్యూ అధికారి, ఇతర గ్రామస్థుల సమక్షంలో రైతుల పేరు మీద డాక్యుమెంట్లు రాయించారు. వాటిని ఇవ్వాళ రైతులకు అందించారు.
మానవత్వాన్ని, ప్రేమను ప్రపంచమంతా చాటాలనే ఉద్దేశంతోనే భూమిని రైతులకు విరాళంగా ఇచ్చామని చెబుతున్నారు. భూమి కోల్పోయిన రైతులకు అది మాత్రమే ఆదారమని.. వరదల కారణంగా కుటుంబ పోషణ కష్టంగా మారిందని అన్నారు. ఈ విషయం తెలుసుకొనే తాము భూమిని కొనిచ్చామని చెప్పుకొచ్చారు. గురునానక్ జన్మదినానికి మించిన రోజు ఏమున్నది.. అందుకే ఇవ్వాళ ఆ భూమిని వారికి అప్పగించామని చెప్పారు.
కాగా బల్వంత్ సింగ్‌కు మరో ముగ్గురు సోదరులు ఉన్నారు. వారందరికీ కలిపి యూపీలో 125 ఎకరాల సాగు భూమి ఉన్నది. వ్యవసాయం మీదే ఆధారపడిన ఆ ఉమ్మడి కుటుంబానికి.. భూమి కోల్పోతే జరిగే నష్టమేంటో తెలుసు. అందుకే తరచూ రైతులకు సాయం చేస్తుంటారు. డబ్బు రూపంలో కాకుండా భూమి దానం చేయడం.. సాగుకు అవసరమైన ట్రాక్టర్లు, ఇతర పరికరాలు కొనుగోలు చేసి ఇవ్వడం వారికి అలవాటు. బల్వంత్ సింగ్ సోదరులు దాతృత్వానికి ఉత్తరాఖండ్‌లోని కంచన్‌పూర్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.