Telugu Global
National

ప్రభుత్వంపై సిద్ధూ మూసేవాలా పేరెంట్స్‌ ఆరోపణలు ఏమనంటే..

సిద్ధూ మరణం తర్వాత ఆయన తల్లిదండ్రులు బల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్-ఐవీఎఫ్ ద్వారా ఇటీవలె ఒక బిడ్డకు జన్మనిచ్చారు.

ప్రభుత్వంపై సిద్ధూ మూసేవాలా పేరెంట్స్‌ ఆరోపణలు ఏమనంటే..
X

పంజాబీ గాయకుడు దివంగత సిద్ధూ మూసేవాలా పేరెంట్స్‌ మరో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విషయం తెలిసిందే. 58 ఏళ్ల వయసులో సిద్ధూ తల్లి చరణ్‌ కౌర్‌ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సిద్ధూ తండ్రి బాల్‌కౌర్‌ సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారు. అయితే అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వయసులో బిడ్డకు జన్మనివ్వడం ఏంటని సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులకు కేంద్రం షాక్ ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే

ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురైన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గం మధ్యలో దుండగులు అతడిని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. సిద్ధూ మరణం తర్వాత ఆయన తల్లిదండ్రులు బల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్-ఐవీఎఫ్ ద్వారా ఇటీవలె ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సిద్ధూ తండ్రి బల్కౌర్ సింగ్.. సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు మగ బిడ్డ జన్మించాడని.. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.

అయితే ఆ తర్వాతే ఈ ఐవీఎఫ్ అంశం తీవ్ర వివాదానికి దారి తీసింది. 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం సరైందేనా అనే సందేహాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేవనెత్తింది. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనేందుకు ఉన్న నియమ నిబంధనల గురించి ఆరా తియ్యడంతో పాటు ఐవీఎఫ్ ద్వారా జన్మనిచ్చే మహిళల వయసు ఎంత ఉండాలి అనేదానిపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఈ క్రమంలోనే సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన నివేదిక, పత్రాలను అందించాలని పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిజానికి మూసేవాలా తల్లిదండ్రులు ఐవీఎఫ్ విధానంలో బాబుకు జన్మనిచ్చినప్పటికీ బాల్‌కౌర్ సింగ్ ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఐవీఎఫ్‌ కోసం మహిళల వయసు 21 నుంచి 50 ఏళ్లు, పురుషుల వయసు 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వీరి నుంచి పలు పత్రాలను ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ పరిణామాలపై సిద్ధూ మూసేవాలా తండ్రి మరోసారి సోషల్ మీడియా వేదికగా ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలకు ట్రీట్‌మెంట్ జరుగుతోందని.. అది పూర్తి అయిన తర్వాత అన్ని పత్రాలు ఇస్తానని.. అప్పటివరకు తమను ఇబ్బంది పెట్టొద్దని.. చికిత్స అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. చికిత్స తర్వాత అధికారులు, ప్రభుత్వం అడిగినప్పుడు తాను అందుబాటులో ఉంటానని.. చట్టపరమైన అన్ని పత్రాలను సమర్పిస్తానని ముందు ట్రీట్‌మెంట్ జరగనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  20 March 2024 10:04 PM IST
Next Story