సిద్ధరామయ్య క్యాబినెట్‌లోకి మరో 24 మంది మంత్రులు
ఇవాళ సిద్ధరామయ్య తన మంత్రి వర్గాన్ని మరోమారు విస్తరించారు. క్యాబినెట్ లోకి మరో 24 మందిని తీసుకున్నారు. వారితో గవర్నర్ థావత్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గాన్ని విస్తరించారు. తన మంత్రివర్గంలో మరో 24 మందికి చోటు కల్పించారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 135 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఏ పార్టీ అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేది ఎవరు అన్న విషయమై సంసిగ్ధత నెలకొంది. సీనియర్ నేత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. సుదీర్ఘ చర్చలు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం చివరికి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసింది.
ఈనెల 20వ తేదీన సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితోపాటు మరో ఎనిమిది మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఇవాళ సిద్ధరామయ్య తన మంత్రి వర్గాన్ని మరోమారు విస్తరించారు. క్యాబినెట్ లోకి మరో 24 మందిని తీసుకున్నారు. వారితో గవర్నర్ థావత్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు.
సిద్ధరామయ్య మంత్రివర్గంలో చేరిన వారిలో హెచ్ కే పాటిల్, దినేష్ గుండూరావు, కృష్ణ బైరెగౌడ, శరనబసప్ప, రాజన్న, శివానంద్ పాటిల్, చలువరాయ స్వామి, వెంకటేష్, మహదేవప్ప, ఈశ్వర్ ఖంద్రే, మల్లికార్జున్, రామప్ప బాలప్ప, శివరాజ్ సంగప్ప, రుద్రప్ప, శరన ప్రసాద్, మంకాల్ వైద్య, లక్ష్మీ హెబ్బాల్కర్, సుధాకర్, రహీమ్ ఖాన్, సంతోష్, బొసే రాజు, సురేష బీఎస్, మధు బంగారప్ప, ఎంసీ సుధాకర్, నాగేంద్ర ఉన్నారు.
తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన వారితో కలుపుకొని సిద్ధ రామయ్య క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 34కు చేరింది. ఈ నెల 20న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ వారికి ఇప్పటివరకు శాఖలు కేటాయించలేదు. ఇవాళ మంత్రివర్గాన్ని విస్తరించడంతో అందరికీ ఒకేసారి శాఖలు కేటాయించే అవకాశం ఉంది.