కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. - డిప్యూటీగా డీకే శివకుమార్
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.
కర్నాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కర్నాటక రాష్ట్రానికి ఆయన 24వ ముఖ్యమంత్రి కావడం గమనార్హం. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పగ్గాలు అందుకోవడం ఇది రెండోసారి. ఇక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ వీరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.
8 మంది మంత్రులు..
సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, కె.హెచ్.మునియప్ప, కె.జె.జార్జ్, ఎం.బి.పాటిల్, సతీశ్ జరిహోళి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ చేత గవర్నర్ థావర్ చంద్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. కేబినెట్‌లో చోటుదక్కించుకున్న ప్రియాంక్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు కావడం గమనార్హం.
సీఎంలు, మాజీ సీఎంల హాజరు
కర్నాటకలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళనాడు, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, అశోక్ గహ్లోత్, నితీశ్ కుమార్, భూపేశ్, సుఖ్వీందర్ సింగ్ సుక్కు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమలానాథ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, సినీ నటుడు, మక్కల్ నీది మయ్యుం అధ్యక్షుడు కమల్ హాసన్ తదితరులు హాజరయ్యారు.