నేను ముసలోడిని రెండేళ్లు పదవి ఇచ్చినా చాలు.. అధిష్టానానికి సిద్ధరామయ్య రిక్వెస్ట్
సిద్ధరామయ్య మాత్రం మరో కొత్త ప్రతిపాదనను అధిష్టానం ముందు ఉంచినట్లు సమాచారం. ఇప్పుడు తన వయసు 75 ఏళ్లయితే, డీకే వయసు 60 ఏళ్లేనని తనకు రెండేళ్లు పదవి ఇచ్చినా చాలు అని అధిష్టానాన్ని కోరుతున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల తర్వాత భారీ విజయం సాధించింది. ఎక్కువగా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే కర్ణాటకలో ఈసారి మాత్రం ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇంత పెద్ద విజయం సాధించిన కాంగ్రెస్ గెలుపు రుచిని మాత్రం ఆస్వాదించలేకపోతోంది. కారణం సీఎం పీఠముడి ఎంతకూ తెగకపోవడమే. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమంగా కష్టపడ్డారు. అందువల్లే ఇద్దరిలో ఎవరిని సీఎంగా ఎంపిక చేయాలో అర్థంకాక కాంగ్రెస్ హై కమాండ్ తలపట్టుకుంది.
ఏ సమస్య లేకుండా చెరి రెండున్నర సంవత్సరాల పాటు సీఎం పదవి ఇస్తే సరిపోతుందని భావించింది. ఈ ప్రతిపాదనను అధిష్టానం ఇద్దరు నాయకుల వద్ద పెట్టగా.. సిద్ధరామయ్య అంగీకరిస్తున్నప్పటికీ డీకే మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. కాంగ్రెస్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత అప్పటివరకు ఎంతో వినయంగా కనిపించిన డీకే ఇప్పుడు స్వరం మారుస్తున్నారు. తానే 135 మందిని గెలిపించుకున్నానని, పదవికి తానే అర్హుడినని మీడియా సమక్షంలోనే ప్రకటించారు.
పరిస్థితి ఈ విధంగా ఉంటే సిద్ధరామయ్య మాత్రం మరో కొత్త ప్రతిపాదనను అధిష్టానం ముందు ఉంచినట్లు సమాచారం. ఇప్పుడు తన వయసు 75 ఏళ్లయితే, డీకే వయసు 60 ఏళ్లేనని తనకు రెండేళ్లు పదవి ఇచ్చినా చాలు అని అధిష్టానాన్ని కోరుతున్నారు. అది కూడా తన వయసును దృష్టిలో పెట్టుకొని మొదట తననే సీఎంను చేయాలని అడుగుతున్నారు. ఈ ప్రతిపాదనను డీకే ఒప్పుకోనట్లు తెలుస్తోంది. ఐదేళ్లపాటు తనకే పదవి అప్పగించాలని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు.
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ కు భారీ సంఖ్యలో స్థానాలు వస్తే రెండేళ్ల తర్వాత కూడా సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగించే అవకాశం ఉందని డీకే భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన పదవిని పంచుకోవడానికి మొగ్గు చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని సీఎంగా ఎంపిక చేస్తుందో చూడాల్సి ఉంది.