Telugu Global
National

నా కాన్వాయ్‌కి జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ వద్దు.. కర్ణాటక సీఎం కీలక నిర్ణయం

ఇక బెంగళూరు మహానగరం దేశంలో అత్యంత రద్దీ ఉన్న నగరాల్లో ఒకటి. ఇక్కడ నిత్యం ట్రాఫిక్ రద్దీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. కార్యాలయాలకు, ఇళ్లకు చేరుకునేందుకు చాలా సమయం తీసుకుంటుంటారు.

నా కాన్వాయ్‌కి జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ వద్దు.. కర్ణాటక సీఎం కీలక నిర్ణయం
X

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని తన కాన్వాయ్ కి ఉన్న జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. సీఎంగా ప్రమాణం చేసిన మరుసటిరోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మామూలుగా ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ ని అధికారులు అమలు చేస్తుంటారు.

ఈ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి కాన్వాయ్ ఎక్కడికి వెళ్లినా ఆ సమయంలో రోడ్లపై పౌరుల వాహనాలు తిరగకుండా పోలీసులు నియంత్రిస్తారు. కాగా, జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ పేరిట ఒక్కోసారి గంటల తరబడి వాహనాలను నిలిపివేస్తుంటారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతుంటారు.

ఇక బెంగళూరు మహానగరం దేశంలో అత్యంత రద్దీ ఉన్న నగరాల్లో ఒకటి. ఇక్కడ నిత్యం ట్రాఫిక్ రద్దీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. కార్యాలయాలకు, ఇళ్లకు చేరుకునేందుకు చాలా సమయం తీసుకుంటుంటారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సీఎం సిద్ధరామయ్య తన కాన్వాయ్ కి ఉన్న జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ ను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని బెంగళూరు పోలీస్ కమిషనర్ కు తెలియజేసినట్లు ఆయన తెలిపారు. సీఎం అయిన తర్వాత సిద్ధరామయ్య తనకు సంబంధించి తీసుకున్న తొలి నిర్ణయం ఇదే.

అలాగే ఆయన మరొక నిర్ణయం కూడా తీసుకున్నారు. వ్యక్తిగత లేదా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు తనకు గౌరవార్థం ఇచ్చే పుష్పగుచ్చాలు, శాలువాలను సైతం స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు ట్వీట్ చేశారు. కానుకల ద్వారా తమ అభిమానాన్ని, గౌరవాన్ని ప్రకటించాలనుకునేవారు పుస్తకాలను ఇవ్వొచ్చని సూచించారు.

ఇక సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఐదు వాగ్దానాలకు ఆమోద ముద్ర వేశారు. వీటి అమలుకు జీవోలు జారీ చేశారు. ఇందులో ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి గృహిణికి నెలకు రూ. 2వేల నగదు ప్రోత్సాహం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి వ్యక్తికి నెలకు పది కిలోల ఉచిత బియ్యం, నిరుద్యోగులకు భృతి అందజేయనున్నారు.

First Published:  22 May 2023 10:17 AM IST
Next Story