Telugu Global
National

అదే భార్య‌.. అదే భ‌ర్త‌.. అయినా మ‌ళ్లీ పెళ్లి..! - ముహూర్తం ఫిక్స్‌

షుకూర్ సంతానం ముగ్గురూ కుమార్తెలే. అయితే ఏంటి అంటారా.. అక్క‌డికే వ‌స్తున్నాం.. షుకూర్‌ గ‌తంలో ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా ప్ర‌కారం పెళ్లి చేసుకున్నారు.

అదే భార్య‌.. అదే భ‌ర్త‌.. అయినా మ‌ళ్లీ పెళ్లి..! - ముహూర్తం ఫిక్స్‌
X

ఆయ‌న‌కు పెళ్లయి 29 ఏళ్ల‌యింది.. భార్య‌, ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు.. అయినా ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణ‌యించుకున్నాడు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 8వ తేదీ బుధ‌వారం మ‌హిళా దినోత్స‌వం రోజు రిజిస్ట్రార్ కార్యాల‌యం వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఆయ‌న పేరు షుకూర్‌. కేర‌ళ‌కు చెందిన సినీ న‌టుడు.. న్యాయ‌వాది. ఆయ‌న ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న‌ది త‌న భార్య‌నే కావ‌డం విశేషం. అవును అదే భార్య‌.. అదే భ‌ర్త‌.. అయినా మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకంటే..

షుకూర్ సంతానం ముగ్గురూ కుమార్తెలే. అయితే ఏంటి అంటారా.. అక్క‌డికే వ‌స్తున్నాం.. షుకూర్‌ గ‌తంలో ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా ప్ర‌కారం పెళ్లి చేసుకున్నారు. ఆయ‌న‌కు కుమారులు లేనందు వ‌ల్ల ఆ వివాహ చ‌ట్టం ప్ర‌కారం షుకూర్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న ఆస్తి పూర్తిగా కుమార్తెల‌కు చెంద‌దు. మూడింట ఒక వంతు ఆస్తి ఆయ‌న సోద‌రుల‌కు వెళ్లిపోతుంది. అందుకే త‌న ఆస్తి మొత్తం త‌న కుమార్తెల‌కే చెందాల‌నే ఉద్దేశంతో ఆ హ‌క్కును క‌ల్పిస్తున్న ప్ర‌త్యేక వివాహ చ‌ట్టం కింద త‌న భార్య షీనాను మ‌రోసారి వివాహం చేసుకోబోతున్న‌ట్టు షుకూర్ వెల్ల‌డించారు.

బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో ఈ పెళ్లి జ‌ర‌గ‌నుంది. షుకూర్‌, షీనా దంప‌తుల‌కు తొలిసారి 1994 అక్టోబ‌రు ఆరో తేదీన వివాహం జ‌రిగింది. ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లితో వారు వార్త‌ల‌కెక్కారు.

First Published:  8 March 2023 9:50 AM IST
Next Story