Telugu Global
National

చంపింది నేనే.. కానీ, నాకేం గుర్తు లేదు

పోలీసులను తాను తప్పుదోవ పట్టించడం లేదని, అన్నీ నిజాలే చెబుతున్నానని, కానీ హత్య జరిగి చాలా రోజులు కావడంతో తనకు కొన్ని విషయాలు గుర్తు రావడంలేదన్నాడు ఆఫ్తాబ్. దీంతో అతడి పోలీస్ కస్టడీని కోర్టు మరో 4రోజులపాటు పొడిగించింది.

చంపింది నేనే.. కానీ, నాకేం గుర్తు లేదు
X

శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఇప్పటికే పోలీసుల ఎదుట నేరం అంగీకరించిన హంతకుడు ఆఫ్తాబ్.. ఇప్పుడు కోర్టులో కూడా తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అయితే తాను క్షణికావేశంలో ఆ హత్య చేశానని అన్నాడు. సాక్ష్యాధారాలు, ఇతర విషయాలపై కోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రం తనకేమీ గుర్తు రావడం లేదని సమాధానం దాటవేశాడు.

సాకేత్ కోర్టులో కేసు విచారణ..

శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఆఫ్తాబ్‌ కు విధించిన 5 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో ఈరోజు అతడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. కోర్టులో జరిగిన విచారణలో, శ్రద్ధాను హత్య చేసింది తానే అని అంగీకరించాడు ఆఫ్తాబ్. ఘర్షణ వాతావరణంతో క్షణికావేశంలో జరిగిన తప్పుగా సర్దిచెప్పుకున్నాడు. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తానని చెప్పాడు. శ్రద్ధా శరీర భాగాలు విసిరేసిన ప్రాంతాల గురించి పోలీసులకు చెప్పానని, కోర్టుకి కూడా అన్ని విషయాలు వెల్లడిస్తానన్నాడు. పోలీసులను తాను తప్పుదోవ పట్టించడం లేదని, అన్నీ నిజాలే చెబుతున్నానని, కానీ హత్య జరిగి చాలా రోజులు కావడంతో తనకు కొన్ని విషయాలు గుర్తు రావడంలేదన్నాడు ఆఫ్తాబ్. దీంతో అతడి పోలీస్ కస్టడీని కోర్టు మరో 4రోజులపాటు పొడిగించింది.

హత్యకోసం ఉపయోగించిన ఆయుధాలేవి..?

పోలీస్ విచారణలో శ్రద్ధా వాకర్ శరీర భాగాలకు సంబంధించిన ఎముకలు దొరకగా వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఇక హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ఇంకా పోలీసులకు దొరకలేదు. కత్తిని మొహ్రౌలీలోని చెత్తకుప్పలో పడేశానని చెప్పాడు ఆఫ్తాబ్, రంపాన్ని గుర్ గ్రామ్ లోని అటవీప్రాంతంలో విసిరేశానన్నాడు. కానీ అవి పోలీసులకు చిక్కలేదు.

ఆఫ్తాబ్‌ తప్పుడు సమాచారం ఇచ్చి కేసుని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే అతడికి పాలిగ్రాఫ్‌ పరీక్ష చేయబోతున్నారు. దీని తర్వాత నార్కో ఎనాలసిస్‌ పరీక్ష కూడా చేస్తారు. ఈ రెండు పరీక్షలకు ఆఫ్తాబ్ అంగీకరించాడు. 10రోజుల్లో వీటి ఫలితాలు వస్తాయి.

First Published:  22 Nov 2022 8:45 AM GMT
Next Story