Telugu Global
National

రామ్ దేవ్ కి షాక్.. పతంజలి ఉత్పత్తులపై నిషేధం

మధుగ్రిట్, ఐగ్రిట్, థైరోగ్రిట్, బీపీ గ్రిట్, లిపిడామ్ అనే ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ నియంత్రణ మండలి నిషేధం విధించింది. ఐదు ఉత్పత్తుల తయారీ, అమ్మకాలను ఆపేసింది.

రామ్ దేవ్ కి షాక్.. పతంజలి ఉత్పత్తులపై నిషేధం
X

అప్పట్లో కరో'నిల్' అనే కరోనా మందు కనిపెట్టానంటూ హడావిడి చేసి భంగపడిన పతంజలి వ్యాపార భాగస్వామి బాబా రామ్ దేవ్ కి, మళ్లీ చానాళ్లకు అలాంటి షాకే తగిలింది. ఆయుర్వేదంతో షుగర్ ని పరిగెత్తిస్తా, బీపీని కంట్రోల్ పెడతా, థైరాయిడ్ కి చరమగీతం పాడతానంటూ ఆయన ప్రచారం చేసుకుంటుంటారు. అయితే ఇలాంటి ప్రచారం సరికాదని అంటోంది ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ నియంత్రణ మండలి. ఆయా ఉత్పత్తులపై నిషేధం విధించింది. పతంజలి దివ్య ఫార్మసీకి చెందిన ఐదు ఉత్పత్తుల తయారీ, అమ్మకాలను ఆపేసింది. తమ అనుమతులు పొందిన తర్వాతే వీటి తయారీని తిరిగి ప్రారంభించుకోవచ్చని తెలిపింది.

మధుగ్రిట్, ఐగ్రిట్, థైరోగ్రిట్, బీపీ గ్రిట్, లిపిడామ్ అనే పేర్లతో దివ్య ఫార్మసీ పతంజలి ఉత్పత్తులను తయారు చేస్తుంది. వీటికి సంబంధించిన ప్రకటనలు కూడా ఇవ్వకూడదని చెప్పింది. ఆయా మందులపై కొన్ని అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలని సూచించింది. తుది అనుమతి పొందిన తర్వాతే తయారీకి అనుమతిస్తామని తేల్చి చెప్పింది. ఈ ఆదేశాలపై పతంజలి సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుర్వేద వ్యతిరేక డ్రగ్ మాఫియా తమకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని పతంజలి సంస్థ ఆరోపించింది. ఆ ఆర్డర్‌ కాపీ తమకింకా అందలేదని పేర్కొంది.

సాధారణ ఆయుర్వేద మందుల తయారీ సంస్థగా పతంజలి వేలకోట్ల మార్కెట్ ని స్థాపించింది. చివరకు రామ్ దేవ్ బాబా బొమ్మ వేసుకుని గోధుమపిండి, ఇడ్లీపిండి కూడా అమ్మేసుకుంటోంది ఈ సంస్థ. కేంద్రంలోని బీజేపీ అండదండలతో పతంజలి వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అయితే కరోనా టైమ్ లో తీసుకొచ్చిన డూప్లికేట్ మెడిసిన్ తో పతంజలి పరువు పోయింది. ఆ తర్వాత అది కేవలం రోగ నిరోధక శక్తిని పెంచే మందు అని, కరోనాని నియంత్రించలేదని చెప్పి కవర్ చేసుకోవాలని చూసింది. కానీ ఇప్పటికే పతంజలి మోసాలపై జనాలకు ఓ అవగాహన వచ్చింది. కానీ ఇంకా బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి సమస్యలకు మందులు అమ్ముతోంది. వీటిని ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధించింది.

First Published:  11 Nov 2022 8:29 AM IST
Next Story