Telugu Global
National

కేజ్రీవాల్‌కు షాక్‌.. పార్టీకి మంత్రి రాజీనామా

పటేల్‌ నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజ్‌కుమార్ ఆనంద్.. కేజ్రీవాల్ ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

కేజ్రీవాల్‌కు షాక్‌.. పార్టీకి మంత్రి రాజీనామా
X

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ తన పదవితో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు రాజ్‌కుమార్ ఆనంద్‌.

అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రారంభమైన ఆమ్‌ ఆద్మీ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు రాజ్‌కుమార్. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్ లాంటి కీలకనేతలు లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇక పదవుల విషయంలోనూ పార్టీ వివక్ష చూపుతోందని ఆరోపించారు రాజ్‌కుమార్. ఆమ్‌ ఆద్మీ పార్టీలో దళిత ఎమ్మెల్యే కానీ, కౌన్సిలర్ కానీ లేడన్నారు. కీలకమైన పదవుల్లోనూ దళితులను నియమించలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంబేద్కర్ సిద్ధాంతాలు ఆచరించే వ్యక్తిగా తాను దళితుల కోసం పని చేయకుంటే ఆ పార్టీలో ఉండడం వృథా అన్నారు.

పటేల్‌ నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజ్‌కుమార్ ఆనంద్.. కేజ్రీవాల్ ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేజ్రీవాల్ అరెస్టు, లిక్కర్ కేసు పరిణామాల నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ మంత్రి రాజ్‌ కుమార్ ఆనంద్‌ కావడం విశేషం.

2023 నవంబర్‌లో ఆనంద్‌ ఇంటిలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ. 7 కోట్లకుపై కస్టమ్స్ ఎగవేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆరోపించింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఆనంద్‌పై కేసు నమోదు చేసింది.

ఇక రాజ్‌కుమార్‌ ఆనంద్‌ ఆరోపణలను కొట్టిపారేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈడీ కేసుల నుంచి బయటపడడంతో పాటు బీజేపీ ఒత్తిడి కారణంగానే రాజ్‌కుమార్‌ పార్టీని వీడారని స్పష్టం చేసింది.

First Published:  10 April 2024 2:35 PM GMT
Next Story