Telugu Global
National

బీజేపీ కూడా అల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థే.. శివమెత్తిన శివసేన

బీజేపీపై శివసేన దుమ్మెత్తి పోసింది. ఆ పార్టీ కూడా అల్ ఖైదా లాంటి ఉగ్రవాద పార్టీ యే నని శివసేన పత్రిక సామ్నా మండిపడింది.

బీజేపీ కూడా అల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థే.. శివమెత్తిన శివసేన
X

మహారాష్ట్రలో ఉధ్దవ్ థాక్రే ప్రభుత్వం పోయి ఏక్ నాథ్ షిండే సర్కార్ అధికారంలోకి వచ్చినా.. థాక్రే నేతృత్వంలోని శివసేన.. బీజేపీపై పోరాటాన్ని ఉధృతంగా కొనసాగిస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలకు బీజేపీయే కారణమంటూ దాన్ని టార్గెట్ చేసింది. తన 'సామ్నా' పత్రిక ద్వారా కాషాయ పార్టీని సేన దుమ్మెత్తిపోసింది. 'ఆపరేషన్ లోటస్' కి ఈ పార్టీ కొత్త నిర్వచనమిచ్చింది. 'లోటస్' అనే పదం 'టెర్రర్' గా ... ఆ పార్టీ ఉగ్రవాద సంస్థ 'అల్ ఖైదా' లా మారిందని ఆరోపించింది. 'దేశంలోని పరిస్థితి అయోమయంగా తయారయింది. కమలం పువ్వు ఉగ్రవాద సంకేతమయింది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలను పడగొట్టడం, పార్టీలను చీల్చడమే పనిగా పెట్టుకుంది.. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దింపే యత్నాల్లో భాగంగా 'ఆపరేషన్ లోటస్' కి శ్రీకారం చుట్టింది.. మీ నిర్వాకం బట్టబయలైందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు' అని 'సామ్నా' లో శివసేన పేర్కొంది. బీహార్ లో బీజేపీ పప్పులుడకలేదని, తెలంగాణాలో సీఎం కేసీఆర్.. హోమ్ మంత్రి అమిత్ షాను బహిరంగంగా సవాలు చేశారని గుర్తు చేసింది. ఈడీ, సీబీఐ వంటి సంస్థలద్వారా నా ప్రభుత్వాన్ని పడగొట్టండి చూద్దాం అని ఆయన ఛాలెంజ్ చేసిన విషయాన్ని ప్రస్తావించింది. మహారాష్ట్రలో షిండే గ్రూపు మాదిరి ఎవరూ తలవంచే ప్రసక్తి లేదని, మీ రాజకీయాలు ఎంతకాలం కొనసాగుతాయో చూస్తామని సేన హెచ్చరించింది.

ఆప్ ఎమ్మెల్యేలు ఎవరైనా తమ పార్టీలో చేరితే వారికి 20 కోట్ల నజరానా ఇస్తామని బీజేపీ ప్రలోభ పెట్టిందని, అంటే ఈ పోకడ ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థమవుతోందని సేన నేతలు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అందరి హస్తం ఉంది.. ప్రభుత్వమే కాదు. లెఫ్టినెంట్ గవర్నర్ భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది.. పైగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎక్కడికీ పారిపోలేదని.. అలాంటిది ఆయనకోసం లుకౌట్ నోటీసులు జారీ చేయడమేమిటని వీరన్నారు. మహారాష్ట్రలో మాదిరి ఢిల్లీలో కూడా సీబీఐ, ఈడీ వంటి సంస్థల ద్వారా అక్కడి ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు మీరు చేసిన యత్నాలు అందరికీ తెలుసు అని శివసేన పేర్కొంది. మా నేత సంజయ్ రౌత్ అసలైన శివసైనికుడిలా మరాఠీ బాణాలతో పోరాడారు.. మా పోరాటం కొనసాగుతుంది అని పునరుద్ఘాటించారు.




First Published:  26 Aug 2022 12:34 PM IST
Next Story