రాజ్ థాక్రే వర్గాన్ని మించిపోతున్న షిండే వర్గం..
ఇప్పుడు శివసేన నుంచి బయటకొచ్చిన షిండే వర్గం రాజ్ థాక్రే రూట్లో వెళ్తోంది. తాజాగా షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బాంగర్.. క్యాటరింగ్ సంస్థ యజమానిపై చేయి చేసుకోవడం కలకలంగా మారింది.
నవనిర్మాణ సేన అంటూ తన వర్గంతోపాటు శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్ థాక్రే.. కొన్నాళ్లపాటు అతివాద రాజకీయాలు నడిపారు. ఎక్కడ చూసినా నవనిర్మాణ సేన హడావిడి, అలజడి కనిపించేది. వారి దెబ్బకి శివసేన మితవాద వర్గంగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు శివసేన నుంచి బయటకొచ్చిన షిండే వర్గం రాజ్ థాక్రే రూట్లో వెళ్తోంది. తాజాగా షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బాంగర్.. క్యాటరింగ్ సంస్థ యజమానిపై చేయి చేసుకోవడం కలకలంగా మారింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
హింగోలీ జిల్లాలో కార్మికులకు మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని చేపడుతున్న క్యాటరింగ్ మేనేజర్ ను ఎమ్మెల్యే బాంగర్ నిలదీశారు. ప్రభుత్వ ప్రమాణాలకు విరుద్ధంగా నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు ఎమ్మెల్యే బాంగర్. ఆ ఫిర్యాదు మేరకు తాను తనిఖీ చేసినట్లు చెప్పారు. అయితే తనిఖీ చేసే నెపంతో క్యాటరింగ్ ఓనర్ రూమ్ లోకి వచ్చిన ఎమ్మెల్యే, అతనిపై చేయి చేసుకున్నాడు. చెంపదెబ్బ కొట్టాడు, పదే పదే కొట్టడంతో అక్కడున్న వారు ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
రెబల్ వర్గం..
అతివాద రాజకీయాలతోనే మహారాష్ట్రలో శివసేన ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో అలాంటి దూకుడు కాస్త తగ్గింది. అందులోనూ శివసేన అధికార పార్టీ కావడంతో, వైరి వర్గాల విమర్శలను కాచుకోవడానికి సైతం కాస్త దూకుడు తగ్గించుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు షిండే వర్గం మాత్రం అలాంటి రెబల్ ఇమేజ్ నే కోరుకుంటోంది. తాజాగా ఎమ్మెల్యే బాంగర్ వ్యవహార శైలి కూడా దీన్నే రుజువు చేస్తోంది. హింగోలీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బాంగర్.. చివరి నిమిషంలో షిండే వర్గంలో చేరారు. ఎమ్మెల్యే దాడి ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మరి దీన్ని సీఎం షిండే సమర్థిస్తారో లేక, ఎమ్మెల్యేని మందలిస్తారో.. వేచి చూడాలి.