Telugu Global
National

రూ.18 లక్షలు.. లాకర్‌లో దాస్తే చెదలు పట్టాయ్‌

బాధిత మహిళ ట్యూషన్లు చెబుతూ చిన్న బిజినెస్‌ చేసుకొని జీవనం సాగిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురవుతున్న ఆమె ఈ ఉదంతంపై బ్యాంకు అధికారులు తనతో ఎలాంటి సమాచారం షేర్‌ చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.18 లక్షలు.. లాకర్‌లో దాస్తే చెదలు పట్టాయ్‌
X

కుమార్తె పెళ్లి కోసం కష్టపడి సంపాదించి కూడబెట్టిన సొమ్ము రూ.18 లక్షలు బ్యాంకు లాకర్‌లో దాచుకుంటే.. వాటికి చెదలు పట్టాయి. ఊహించని పరిణామంతో బాధిత మహిళ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అల్కా పాఠక్‌ అనే మహిళ గతేడాది అక్టోబర్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆషియానా బ్రాంచ్‌ లాకర్‌లో రూ.18 లక్షలు దాచుకున్నారు. ఇటీవల బ్యాంకు అధికారులు ఆమెను సంప్రదించి లాకర్‌ అగ్రిమెంటును రెన్యువల్‌, కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయించుకునేందుకు రావాలని కోరారు. దీంతో బ్యాంకుకు వచ్చిన ఆమె లాకర్‌లో దాచుకున్న సొమ్ము సక్రమంగా ఉందో లేదోనని చూసుకునేందుకు లాకర్‌ తెరిచారు. లాకర్‌లో ఉన్న నగదుకు చెదలు పట్టి ఉండటం చూసి విస్తుపోయారు. తన కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న సొమ్మంతా చెదలు పట్టడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన బ్యాంకు అధికారులను షాక్‌కు గురిచేసింది. ఈ విషయం బయటికొచ్చి.. మీడియా ఒత్తిడి చేయడంతో దీనిపై వారు స్పందించారు. తమ బ్యాంకు హెడ్డాఫీసుకు దీనిపై నివేదిక పంపినట్టు చెప్పారు.

బాధిత మహిళ ట్యూషన్లు చెబుతూ చిన్న బిజినెస్‌ చేసుకొని జీవనం సాగిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురవుతున్న ఆమె ఈ ఉదంతంపై బ్యాంకు అధికారులు తనతో ఎలాంటి సమాచారం షేర్‌ చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్యాంకు నుంచి సరైన స్పందన, సహకారం లభించకపోతే మీడియా సాయం తీసుకొని ఈ విషయాన్ని విస్తృతం చేస్తానని చెప్పారు. ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకొచ్చిన తాజా నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో ఎలాంటి నగదూ నిల్వ చేయకూడదు. అలాగే, లాకర్‌ను ఉపయోగించే లైసెన్స్‌ కేవలం నగలు, పత్రాలు వంటి విలువైన వస్తువులు నిల్వ చేసుకొనేందుకు, చట్టబద్ధమైన ప్రయోజనాల కోసమే గానీ, నగదును నిల్వ చేయడానికి కాదని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాకర్‌ ఒప్పందంలో కూడా పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. బాధిత మహిళకు న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచిచూడాలి.

First Published:  29 Sept 2023 8:09 AM IST
Next Story