Telugu Global
National

సోనియా, థరూర్ చర్చలు.. అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ

సోనియా గాంధీతో థరూర్ భేటీ ఆసక్తికరంగా మారింది. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో థరూర్ పోటీకి సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

సోనియా, థరూర్ చర్చలు.. అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ
X

కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠకు కార‌ణం అవుతున్నాయి. పగ్గాలు వద్దన్న రాహుల్ గాంధీ జోడో యాత్రతో దూసుకెళ్లడం పార్టీ శ్రేణులకు సంతోషాన్ని కలిగిస్తున్నా.. అధ్యక్షుడిగా గాంధీ వారసుడు లేకపోతే జనంలో పలుచన అవుతామన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ దశలో వివిధ రాష్ట్రాలు రాహుల్ గాంధీయే పగ్గాలు చేపట్టాలంటూ తీర్మానాలు చేస్తున్నాయి. అయితే రాహుల్ కి పోటీగా శశిథరూర్ పేరు బయటకు రావడం ఇక్కడ ఊహించని ట్విస్ట్. ఆయన పోటీపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా సోనియా గాంధీతో థరూర్ భేటీ మాత్రం ఆసక్తికరంగా మారింది. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో థరూర్ పోటీకి సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

ఆజాద్, థరూర్.. ఇద్దరూ వేర్వేరు..

గులాంనబీ ఆజాద్, శశి థరూర్.. ఇద్దరీలో ఉన్న కామన్ పాయింట్ జి-23. అయితే ఆజాద్, పార్టీని తీవ్రంగా విమర్శించి బయటకెళ్లిపోయారు, థరూర్ మాత్రం పార్టీలోనే ఉంటూ బాగు కోరుకుంటున్నారు. పార్టీని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో ఇలాంటి వారిని దూరం చేసుకోకూడదని భావిస్తున్న సోనియా గాంధీ.. థరూర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ సంస్కరణల గురించి ప్రస్తావించిన థరూర్ మాటల్ని ఆమె గౌరవించారని తెలుస్తోంది. అందుకే పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు థరూర్ కి అవకాశమిచ్చారని కూడా అంటున్నారు. శశిథరూర్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా.. ఆయనతో పార్టీకి, పార్టీతో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేవనే విషయం మాత్రం ఇప్పుడు స్పష్టమవుతోంది.

ఈ ఏడాది మే 15న చేసిన ఉదయ్‌ పూర్‌ నవ్‌ సంకల్ప్‌ ప్రకటనను పూర్తిగా అమలు చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షపదవికి పోటీ చేసే అభ్యర్థులు బహిరంగంగా ప్రతిజ్ఞ చేయాలని ఇటీవల ఓ ఆన్ లైన్ పిటిషన్ ను కొందరు యువ కార్యకర్తలు రూపొందించారు. దీనిపై 650 మందికి పైగా సంతకాలు చేశారని శశిథరూర్ ట్వీట్ చేశారు. దీనికి తాను కూడా అంగీకరిస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత ఆయన సోనియాతో భేటీ అయ్యారు. అయితే ఆన్ లైన్ పిటిషన్ వ్యవహారం సోనియా వద్ద చర్చకు వచ్చిందా లేదా అనేది శశిథరూర్ స్పష్టం చేయలేదు. పార్టీలో సంస్కరణలు రావాలంటున్నవారిలో థరూర్ కూడా ఒకరు. అప్పట్లో జి-23 లో ఉండి హడావిడి చేసినా, మిగతావారి లాగా ఆయన విమర్శలు కొనసాగించలేదు, పార్టీనుంచి బయటకు వెళ్లలేదు.

ఎన్నికలు ఉంటాయా..?

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌ ఈనెల 24న ప్రారంభం అవుతుంది. 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏకగ్రీవం కాకపోతే అక్టోబర్‌ 17న ఓటింగ్‌ ఉంటుంది. 19న ఫలితాలు ప్రకటిస్తారు. పలు రాష్ట్రాల నాయకులు రాహుల్ గాంధీ ఏకగ్రీవం కోసం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.

First Published:  20 Sept 2022 7:28 AM IST
Next Story