విపక్ష కూటమి పేరు భారత్.. ప్రతిపాదించిన శశిథరూర్..!
రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్, భారత్ అంటే ఇండియా అని ఉందని.. దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదని, ఇందుకోసం తీర్మానం కూడా చేయాల్సిన అవసరం లేదని శశిథరూర్ పేర్కొన్నారు.
ఇండియా పేరు మార్పు విషయంలో జరుగుతున్న వివాదంపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్. కేంద్రంలోని మోడీ సర్కార్‌పై సెటైర్లు వేశారు. ప్రతిపక్ష కూటమి పేరు ఇండియాకు బదులుగా భారత్ అర్థం వచ్చే పేరును ప్రతిపాదించారు. భారత్ అంటే బెటర్‌మెంట్, హార్మొనీ, రెస్పాన్సిబుల్ డ్వాన్స్‌మెంట్ ఫర్ టుమారో అంటూ కొత్త అర్థం చెప్పారు. అయితే అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పేర్లు మార్చే ఆటను ఇక్కడితో ఆపకపోవచ్చంటూ ట్వీట్ చేశారు.
రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్, భారత్ అంటే ఇండియా అని ఉందని.. దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదని, ఇందుకోసం తీర్మానం కూడా చేయాల్సిన అవసరం లేదని శశిథరూర్ పేర్కొన్నారు. భారత్‌గా పిలిచేందుకు రాజ్యాంగపరంగా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దేశానికి ఉన్న రెండు అధికారిక పేర్లలో ఇది ఒకటని ట్వీట్ చేశారు. అయితే శతాబ్ధాలుగా ఓ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఇండియా పేరును తొలగించేంత తెలివి తక్కువగా మోడీ సర్కార్ వ్యవహరిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. రెండు పేర్లను కొనసాగించడం మేలని సూచించారు.
ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత జై రాంరమేష్ సైతం ఇలాంటి ట్వీటే చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ -1 ప్రకారం భారత్.. ఇండియా అనేది రాష్ట్రాల యూనియన్ అని ఉందని ఇప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్‌పై దాడి జరుగుతోందని ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఇండియాను విడదీస్తున్నారని మండిపడ్డారు. ఇండియా కూటమి లక్ష్యం కూడా భారత్ అని పేర్కొన్న జై రాం.. భారత్ అంటే బ్రింగ్ హార్మొని, అమిటి, రీకాన్సిలేషన్ అండ్ ట్రస్ట్ అంటూ అభివర్ణించారు. జూడేగా భారత్, జీతేగా ఇండియా అని ట్వీట్ చేశారు.
జీ-20 సమావేశాల నేపథ్యంలో ఈ నెల 9వ తేదీని వివిధ దేశాధినేతలకు రాష్ట్రపతి భవన్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు ఆహ్వానిస్తూ పంపిన ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం వివాదానికి దారి తీసింది. త్వరలోనే ఇండియా స్థానంలో భారత్‌గా పేరు మార్చనున్నారని ప్రచారం జోరందుకుంది. ఈ నెలలో జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారని తెలుస్తోంది.
*