పోలింగుకు ముందే ఓటమిని ఒప్పేసుకున్నారా ?
ముంబయ్ లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతు తన బాధనంతా వెళ్ళబోసుకున్నారు. ఇంతకీ ఆయన బాధేమిటంటే తనకు వివిధ రాష్ట్రాల్లోని పీసీసీలు సహకరించలేదట. తాను ప్రచారానికి వెళితే సీనియర్ నేతలంతా మొహం చాటేశారట.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ వ్యవహారం అలాగే అనిపిస్తోంది. ముంబయ్ లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతు తన బాధనంతా వెళ్ళబోసుకున్నారు. ఇంతకీ ఆయన బాధేమిటంటే తనకు వివిధ రాష్ట్రాల్లోని పీసీసీలు సహకరించలేదట. తాను ప్రచారానికి వెళితే సీనియర్ నేతలంతా మొహం చాటేశారట. అదే తన పోటీదారుడు మల్లికార్జున ఖర్గే వెళినపుడు అందరు సహకరించారట.
తాను వివిధ రాష్ట్రాల్లో పర్యటించినపుడు తనకు సీనియర్ నేతల్లో ఎవరు అందుబాటులోకి కూడా రాలేదన్నారు. తనకు చాలావిచిత్రమైన అనుభవాలు ఎదురైనట్లు ఆయన తెగ బాధపడిపోయారు. సో థరూర్ తాజా వ్యాఖ్యలతో పోలింగుకు ముందే ఓటమిని అంగీకరించేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ థరూర్ మరచిపోయిన విషయాలు రెండున్నాయి. అవేమిటంటే మొదటిది ఒకపుడు సోనియాగాంధీని బాగా ఇబ్బందిపెట్టిన జీ23 నేతల్లో తాను కూడా ఒకడినని.
ఏ విషయమైనా డైరెక్టుగా సోనియాతో మాట్లాడేంత సన్నిహితం ఉన్న నేతలు జీ23గా ఏర్పడి పదేపదే లేఖలు రాశారు. పార్టీ నిర్ణయాలను, ప్రస్తుత పరిస్ధితులను, నాయకత్వం లోపాలను ఎత్తిచూపుతు లేఖలు రాయటమే కాకుండా మీడియాకు విడుదలచేశారు. దాంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ ఇమేజి జనాల్లో మరింతగా డ్యామేజి అయిపోయింది. అలాంటి గ్రూపులోని తాను అధ్యక్షపదవికి పోటీచేస్తే నేతలు సహకరిస్తారని థరూర్ ఎలాగ అనుకున్నారు ?
ఇక రెండో కారణం ఏమిటంటే ఆయన సొంత రాష్ట్రం కేరళలోనే థరూర్ ను అందరు వ్యతిరేకించారు. అద్యక్షపదవికి అసలు పోటీచేయద్దని కేరళలో నేతలు ఎంతచెప్పినా థరూర్ వినలేదు. తన సొంత రాష్ట్రమే తనను ఓన్ చేసుకోనపుడు ఇక మిగిలిన రాష్ట్రాలు మద్దతుగా నిలబడతాయని అనుకోవటం థరూర్ అమాయకత్వంమే. ఖర్గేకి సోనియా ఆశీస్సులున్నాయనే ప్రచారం తర్వాత కూడా థరూర్ పోటీచేయటం ఆయన తప్పే. అలాంటిది 17వ తేదీన పోలింగ్ జరగబోతుంటే తనకెవరు సహకరించలేదని, ఖర్గేకి బ్రహ్మరథం పట్టారని గోలచేస్తే ఏమొస్తుంది ?