Telugu Global
National

నార్త్ ఇండియా మెంటాలిటీ వల్లే మహిళా రిజర్వేషన్స్ బిల్లుకు మోక్షం రాలేదు -పవార్

ఉత్తర భారత మనస్తత్వంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారత మనస్తత్వం వల్లనే పార్లమెంటులో మహిళా రిజర్వేష‌న్ బిల్లు పాస్ కాలేదని ఆయన వ్యాఖ్యానించారు.

నార్త్ ఇండియా మెంటాలిటీ వల్లే మహిళా రిజర్వేషన్స్ బిల్లుకు మోక్షం రాలేదు -పవార్
X

లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు నార్త్ ఇండియా మెంటాలిటీ సిద్దంగా లేదంటూ ఎన్ సీపీ నేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శనివారం పూణె డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన కుమార్తె, లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలేతో ముఖాముఖిలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్‌ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో ఇంకా ఆమోదం పొందాల్సి ఉందని, దీన్ని బట్టి మహిళా నాయకత్వాన్ని అంగీకరించడానికి దేశం మానసికంగా సిద్ధంగా లేదని తేలిపోతుందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

తాను కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్‌లో ఈ అంశంపై మాట్లాడుతున్నానని పవార్ అన్నారు.

"పార్లమెంటు సభ్యుల మనస్తత్వం,ముఖ్యంగా ఉత్తర భారతదేశ మనస్తత్వం ఇందుకు అనుకూలంగా లేదు. నేను కాంగ్రెస్ లోక్‌సభ సభ్యునిగా ఉన్నప్పుడు పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్ల సమస్య గురించి మాట్లాడాను. ఒకసారి నా ప్రసంగం ముగించి వెనక్కి తిరిగి చూస్తే మా పార్టీకి చెందిన మెజారిటీ ఎంపీలు లేచి వెళ్లిపోయారు. అంటే నా పార్టీకి చెందిన వారు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోయారు.'' అని పవార్ చెప్పారు. అయినా బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉండాలని పవార్ కోరారు.

"నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జిల్లా పరిషత్, పంచాయతీ సమితి వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాము. మొదట దీనిని అందరూ వ్యతిరేకించారు, కానీ తరువాత ప్రజలు దానిని మెల్లెగా ఆమోదించారు" అన్నారాయన.

First Published:  18 Sept 2022 1:28 PM IST
Next Story