Telugu Global
National

వెన్నుపోటు: బాబాయ్ అబ్బాయ్ మాటల తూటాలు

ఇది గూగ్లీ కాదని, రాబరీ అని.. ఇది ఎంతమాత్రం చిన్న విషయం కాదని అన్నారు శరద్ పవార్. ఈరోజు జరిగిన పరిణామాలకు సంబంధించిన క్రెడిట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాలన్నారు.

వెన్నుపోటు: బాబాయ్ అబ్బాయ్ మాటల తూటాలు
X

బాబాయ్ (శరద్ పవార్)కి అబ్బాయ్ (అజిత్ పవార్) వెన్నుపోటు పొడిచారు. పైగా పార్టీ కూడా తనదేనంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది ఎన్సీపీ చీలిక వర్గం కాదని, ఎన్సీపీయేనని క్లారిటీ ఇచ్చారు అజిత్ పవార్. ఒక పార్టీగానే తనతోపాటు తన ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరారని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఎన్సీపీ గుర్తుతోనే ఎన్నికలకు వెళ్తామని బాంబు పేల్చారు అజిత్. ఇటీవల శివసేనలో కూడా ఇలాగే చీలిక రావడంతో పేరు, గుర్తు షిండే వర్గానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శరద్ పవార్ విషయంలో కూడా అదే జరిగేలా ఉంది. 40మంది ఎమ్మెల్యేలను తనతో తీసుకెళ్లిన అజిత్ పవార్.. పార్టీ పేరు, గుర్తు తనవేనంటూ బాబాయ్ కి షాకిచ్చారు.


తగ్గేదే లేదు..

అటు శరద్ పవార్ కూడా ఈ విషయంలో తగ్గేదే లేదంటున్నారు. ఇలాంటి ఆటుపోట్లు చాలానే చూశానంటున్న ఆయన.. పార్టీని ప్రజలే కాపాడుకుంటారని చెప్పుకొచ్చారు. గతంలో పార్టీని వీడి వెళ్లిన వారంతా సొంత నియోజకవర్గాల్లోనే ఓటమి చవిచూశారని, ఇప్పుడు కూడా అదే ఫలితం రిపీట్ అవుతుందని శాపనార్థాలు పెట్టారు.

దోపిడీ క్రెడిట్ మోదీదే..

ఇది గూగ్లీ కాదని, రాబరీ అని.. ఇది ఎంతమాత్రం చిన్న విషయం కాదని అన్నారు శరద్ పవార్. ఈరోజు జరిగిన పరిణామాలకు సంబంధించిన క్రెడిట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాలన్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను శరద్ పవార్ గుర్తు చేశారు. ఎన్సీపీ ఫినిష్డ్ పార్టీ అని మోదీ అన్నారని, తమ పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు చేశారని, ఆ తర్వాత కొంతమందిపై ఈడీ దాడులు జరుగుతాయనే వార్తలు కూడా వచ్చాయని, ఆ వెంటనే ఈ తీవ్ర పరిణామం జరిగిందన్నారు. ఎన్సీపీ నేతలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు కాబట్టి వారిపై అవినీతి ఆరోపణలు తొలగిపోయినట్టే అని చెప్పారు. అందుకు మోదీకి కృతజ్ఞతలు అని సెటైర్లు వేశారు శరద్ పవార్.



First Published:  2 July 2023 8:08 PM IST
Next Story