నేను భారత్ జోడో యాత్రలో పాల్గొంటా : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు.
భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు ఇతర పార్టీ నాయకులు యాత్రలో రాహుల్ గాంధీతో పాటు నడవలేదు. మొదటి రోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాత్రం జెండా ఊపి ప్రారంభించారు. మిత్ర పక్షలకు చెందిన కొంత మంది నాయకులు రాహుల్‌కు సంఘీభావంగా నడిచారు. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ కూడా యాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరాట్ తనను కలిసి నవంబర్ 7న భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని కోరారని పవార్ తెలిపారు.
నవంబర్ 7న రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించనున్నది. ఆ రోజు వివిధ పార్టీ నాయకులతో కలసి ఘన స్వాగతం పలకాలని మహారాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో అన్ని పార్టీల ముఖ్యులకు ఆహ్వానం పలుకుతున్నారు. శరద్ పవార్‌ను ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. భారత్ జోడో యాత్రలో తానూ భాగస్వామిని అవుతానని, సమాజంలో సామరస్యత తీసుకొని వచ్చేందుకు రాహుల్ చేపట్టిన ఈ యాత్రలో పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా, 150 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన 3,750 కిలోమీటర్ల పాదయాత్రలో ఇప్పటికే వెయ్యి కిలోమీటర్లకు పైగా యాత్రను రాహుల్ పూర్తి చేశారు. ఇవ్వాళ తెలంగాణలో ప్రవేశించిన తర్వాత మూడు రోజుల పాటు దీపావళి పండుగ కోసం విరామం ఇచ్చారు. తిరిగి ఈ నెల 27న నారాయణపేట జిల్లా కృష్ణ మండలం నుంచి యాత్ర ప్రారంభం కానున్నది.