పరమపదించిన ద్వారకాపీఠం శంకరాచార్యస్వామి
ద్వారకాపీఠం శంకరాచార్యస్వామి స్వరూపానంద సరస్వతి పరమపదించారు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లోని పరమహంసి గంగాశ్రమంలో మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ద్వారకాపీఠం శంకరాచార్యస్వామి స్వరూపానంద సరస్వతి పరమపదించారు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లోని పరమహంసి గంగాశ్రమంలో మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1924లో జన్మించిన శంకరాచార్యస్వామి 99వ పుట్టినరోజును ఇటీవల భక్తులు ఘనంగా నిర్వహించారు.
జబల్‌పూర్ సమీపంలోని డిఘోరి గ్రామంలో జన్మించిన ఆయన తొమ్మిదో సంవత్సరంలోనే ఇంటిని విడిచిపెట్టారు. హిందూమతోద్ధరణకు నడుంకట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి చేరుకుని స్వామి కర్పత్రి మహరాజ్ శిష్యరికంలో వేదాధ్యయనం చేశారు.
స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లిన దేశభక్తుడాయన. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విశేషంగా కృషిచేశారు. ఆయన అస్తమించిన సమాచారం తెలిసిన వెంటనే భక్తులు పెద్దసంఖ్యలో ఆశ్రమానికి చేరుకుంటున్నారు.
ఆదిశంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాల్లో ద్వారకలోని పశ్చిమామ్నాయ శ్రీశారదా పీఠం ఒకటి. సామవేదానికి ప్రతీకగా ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఈ పీఠాన్ని స్థాపించారు. 1981లో స్వరూపానంద సరస్వతి ఈ పీఠాధిపతి అయ్యారు.