ఎయిర్ ఇండియా ఘటన : వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు
అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టాయి. శనివారం శంకర్ మిశ్రా బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తూ 75 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన శంకర్ మిశ్రా(34) అమెరికాలో ఆర్థిక సేవల సంస్థ అయిన వెల్స్ ఫార్గోలో ఒక కీలక హోదాలో పని చేస్తున్నాడు. అతడు నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు.
బిజినెస్ క్లాస్ లో ప్రయాణించిన అతడు మధ్యాహ్నం భోజనం తర్వాత విమానంలో లైట్లు ఆర్పివేసిన సమయంలో మద్యం మత్తులో ఒక వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. అయితే దీనిపై వృద్ధురాలు విమానంలోని సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత బాధితురాలు టాటా గ్రూప్ చైర్మన్ కు ఈ విషయమై ఒక లేఖ రాసింది. తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని తెలియజేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో శంకర్ మిశ్రాపై ముంబై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టాయి. శనివారం శంకర్ మిశ్రా బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఉద్యోగం కూడా కోల్పోయిన శంకర్ మిశ్రా
విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే శంకర్ మిశ్రాను అమెరికా కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న కంపెనీ వికృత చేష్టకు పాల్పడిన శంకర్ మిశ్రాపై చర్యలు చేపట్టింది. అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఇటీవల ప్రకటించింది. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా శంకర్ మిశ్రా పేరును నో ఫ్లై లిస్ట్ లో చేర్చింది.