రేపిస్టులను జైలు నుండి విడుదల చేయడం సిగ్గుచేటు -పవార్ ఆగ్రహం
బిల్కీస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఏడుగురిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం సిగ్గుచేటని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేయడం కూడా సరికాదని ఆయన అన్నారు.
గుజరాత్ ప్రభుత్వం జీవిత ఖైదీలుగా ఉన్న 11 మంది రేపిస్టులను జైలునుంచి విడుదల చేయడం సిగ్గు చేటని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలోని థానేలో విలేకరులతో మాట్లాడిన పవార్, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఎర్ర కోటపై ఇచ్చిన ప్రసంగాన్ని గుర్తు చేశారు. మహిళలను గౌరవించాలని ప్రధాని ఇచ్చిన పిలుపుకు వ్యతిరేకంగా గుజరాత్ బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిందని పవార్ మండిపడ్డారు.
''దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కోర్టులు వారికి జైలు శిక్షలువిధిస్తూ ఉంటే బిల్కిస్ కేసులో దోషులను విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు'' అని ఆయన అన్నారు.
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేయడం కూడా సరికాదని పవార్ అభిప్రాయపడ్డారు.
''తీస్తా సెతల్వాద్ కేసులో గుజరాత్ ప్రభుత్వం చేస్తున్నది పూర్తిగా తప్పు'' అని ఆయన అన్నారు.
2002 గుజరాత్ అల్లర్ల కేసుల్లో ప్రభుత్వం పై కొట్లాడుతున్న సెతల్వాద్ ను తప్పుడు సాక్ష్యాలను సమర్పించారనే ఆరోపణలపై జూన్‌లో గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు.
2002 గుజరాత్ మతపరమైన దాడుల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది వ్యక్తులను ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుండి ప్రభుత్వం విడుదల చేసింది.
11 మంది దోషుల్లో ఒకరికి శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం అంఅదరినీ విడుదల చేసింది.